Hair Counselling: విరివిగా జుట్టు ఊడిపోతుందా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ABN, First Publish Date - 2023-09-28T11:08:29+05:30
డాక్టర్! నా వయసు 23 సంవత్సరాలు. కొన్ని నెలలుగా వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతున్నాయి. ఎన్నో రకాల నూనెలు, చిట్కాలు ప్రయోగించాను. కానీ ఏమాత్రం ఫలితం లేదు. జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి?
డాక్టర్! నా వయసు 23 సంవత్సరాలు. కొన్ని నెలలుగా వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతున్నాయి. ఎన్నో రకాల నూనెలు, చిట్కాలు ప్రయోగించాను. కానీ ఏమాత్రం ఫలితం లేదు. జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి?
- ఓ సోదరి, హైదరాబాద్.
వెంట్రకలు రాలడం పట్ల, వాటి పోషణ పట్ల కొన్ని అపోహలు ఉంటున్నాయి. నూనె వెంట్రుకలను మాయిశ్చరైజ్ చేయగలుగుతుందే తప్ప పెరుగుదలకు ఏమాత్రం తోడ్పడదు. వెంట్రుకల పెరుగుదల జన్యుపరంగా సంక్రమించిన లక్షణం మీద ఆధారపడి ఉంటుంది. వెంట్రుకలు పొడిబారినా, మెత్తగా తయారవ్వాలన్నా తలస్నానానికి అరగంట ముందు వెంట్రుకలకు నూనె పట్టించి మసాజ్ చేసి తలస్నానం చేయాలి. ఇందుకోసం తలనూనెను వాడొచ్చు. అలాగే కొందరు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలుతుందని అనుకుంటారు. నిజానికి హెల్మెట్ పెట్టుకోవడం మూలంగా తలలో చమట పట్టి, చుండ్రు ఎక్కువై, దాని వల్ల పుండ్లు పడి వెంట్రుకలు రాలే అవకాశం ఉంటుంది. అంతేగానీ తలను శుభ్రంగా ఉంచుకున్నంతకాలం హెల్మెట్ పెట్టుకున్నా వెంట్రుకలు రాలవు. అలాగే కలబంద గుజ్జు, కోడి గుడ్డు సొన, మందార ఆకు లాంటివి జుట్టుకు పట్టించడం వల్ల వెంట్రుకలు మెత్తగా మారతాయే తప్ప పెరగవు. జుట్టు రాలడాన్ని ఏ విధంగానూ అడ్డుకోలేవు.
వెంట్రులు ఆరోగ్యంగా!
శరీరంలో ఎలాంటి చెడు జరిగినా ఆ ప్రభావం వెంట్రుకల్లో ప్రతిబింబిస్తుంది. శరీరానికి సరిపడా పోషకాలు అందకపోయినా ఆ ప్రభావం వెంట్రుకల మీద పడుతుంది. ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో ఖర్చయిపోగా మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు వెళ్తాయి. ఒకవేళ సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి, రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారంతోపాటు, విటమిన్ ఇ, డి, సి, బి - కాంప్లెక్స్ సక్రమంగా, సరిపడా అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించాలి. అలాగే వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోవాలి. వాతావరణ మార్పుల ప్రభావానికి లోనవకుండా, కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాలి.
ఇవి కూడదు ...
వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే....
- క్లోరిన్ కలిపిన స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లేముందు మంచినీళ్లతో తలస్నానం చేసి క్యాప్ పెట్టుకోవాలి. ఈత కొట్టిన తర్వాత చివర్లో మళ్లీ మంచి నీళ్లతో తలస్నానం చేయాలి.
- ఎండలోకి వెళ్లే ప్రతిసారీ సన్‌స్ర్కీన్ హెయిర్ స్ర్పే వాడాలి.
- తలకు వేడి లేదా చల్లని గాలి పదే పదే తగలకుండా చూసకోవాలి.
- ఎండలో వెళ్లేటప్పుడు తలకు స్కార్ఫ్ కట్టుకోవాలి, లేదా క్యాప్ పెట్టుకోవాలి.
- హెయిర్ డ్రయ్యర్, స్ట్రయిటెనర్, హెయిర్ స్ర్పేలు తరచుగా వాడకూడదు.
- హార్ష్ షాంపూలు వాడకూడదు.
డాక్టర్ ఎ. రవిచందర్ రావు,
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, హైదరాబాద్.
Updated Date - 2023-09-28T11:08:29+05:30 IST