Shoulder pain: భుజాల నొప్పి బలాదూర్! అదెలాగంటే..!
ABN, First Publish Date - 2023-05-16T11:54:36+05:30
ఆర్థ్రయిటిస్ అనగానే మనకు మోకాళ్ల నొప్పి ఒక్కటే గుర్తొస్తుంది. కానీ నిజానికి మోకాళ్లలాగే, తుంటి, వెన్ను... ఇలా ఒంట్లోని ప్రతి కీలూ నొప్పికి గురయ్యే వీలుంటుంది.
ఆర్థ్రయిటిస్ అనగానే మనకు మోకాళ్ల నొప్పి ఒక్కటే గుర్తొస్తుంది. కానీ నిజానికి మోకాళ్లలాగే, తుంటి, వెన్ను... ఇలా ఒంట్లోని ప్రతి కీలూ నొప్పికి గురయ్యే వీలుంటుంది. అలాగే భుజం కీళ్లు కూడా నొప్పికి గురవుతాయి. అలాంటప్పుడు మోకాళ్ల మార్పిడి మాదిరిగానే భుజాల్లోని కీళ్లను కూడా మార్చే వెసులుబాటు ఉందంటున్నారు వైద్యులు.
మోకాళ్ల నొప్పిని పరిగణించినంత తీవ్రంగా భుజం నొప్పిని పరిగిణించం. మోకాలి నొప్పులతో నడవడం కష్టం కాబట్టి, వెంటనే వైద్యులను కలిసి చికిత్స మొదలుపెట్టేస్తాం. కానీ భుజం నొప్పి విషయంలో కాస్త అశ్రద్ధ కనబరుస్తూ ఉంటాం. నరం లేదా కండరం పట్టేసి ఉంటుందని మనకి మనం సర్ది చెప్పుకుని, రెండు రోజులు ఆగితే అదే తగ్గిపోతుందులే అనే భరోసాలో ఉండిపోతాం. నొప్పి వేధిస్తే మర్దన చేయించుకుంటాం. పైపూత మందులు లేదా పెయిన్ కిల్లర్స్ వాడేసి తిరిగి పనుల్లో పడిపోతూ ఉంటాం. అయితే భుజం నొప్పిని నిర్లక్ష్యం చేయడం సరి కాదు. నొప్పికి కారణాలను కనిపెట్టి, తీవ్రతను బట్టి ఎముకల వైద్యులను కలిసి చికిత్స మొదలుపెట్టాలి.
కారణాలు ఇవే! భుజాల కీళ్లు అరగడానికి వేర్వేరు కారణాలుంటాయి. యువత నుంచి పెద్దల వరకూ అందర్లో ఈ సమస్య తలెత్తవచ్చు.
వయసురీత్యా: పైబడే వయసు రీత్యా శరీరంలోని మిగతా కీళ్లు అరిగినట్టే భుజాల కీళ్లు కూడా అరిగిపోతాయి. ఇలా ఆస్టియో ఆర్థ్రయిటిస్ వల్ల భుజాల్లోని కీళ్లు అరిగిపోవడం పెద్దల్లో అత్యంత సహజం.
కీళ్ల వాతం: కీళ్ల వాతం సమస్య ఉన్న వాళ్లలో శరీరంలోని పలు కీళ్లు అరిగిపోతూ ఉంటాయి. వాటిలో భుజం కీళ్లు కూడా ఉంటాయి. ఇది చిన్న వయస్కుల్లో (30 నుంచి 40 ఏళ్లు) కూడా ఉండవచ్చు.
కండరాల సమస్య: భుజాల్లో రొటేటర్ కప్ కండరాలు దెబ్బతింటూ ఉంటాయి. ఈ డ్యామేజీని అశ్రద్ధ చేయడం వల్ల దీర్ఘకాలంలో భుజాల్లోని కీళ్లు అరిగిపోతాయి.
భుజం జారడం: కొందరికి భుజాల్లోని కీళ్లు పదే పదే జారుతూ ఉంటాయి. ఈ సమస్యను కొందరు సంవత్సరాల తరబడి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీని వల్ల కూడా భుజంలోని కీలు అరిగిపోయే అవకాశం ఉంటుంది.
భుజాల నొప్పి ఎలా ఉంటుందంటే...
భుజం నొప్పి
క్రమేపీ భుజంలో కదలికలు తగ్గిపోవడం
జాయింట్ లోపల కరకరమనే శబ్దం
సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు రాత్రుళ్లు కూడా నొప్పి వేధించడం
భుజం అరుగుదలకు కారణం ఏదైనా చేసే చికిత్స ఒకే విధంగా ఉంటుంది.
భుజం నొప్పి ప్రారంభ దశలో మృదులాస్థిని నయం చేసే మందులు, కొన్ని రకాల వ్యాయామాలు, తీవ్రతను బట్టి కొన్ని రకాల ఇంజెక్షన్లు తీసుకోవడం ద్వారా నొప్పిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. అయితే ఈ దశను దాటి నొప్పి తీవ్రంగా ఉన్న సందర్భాల్లో ‘ఆర్థ్రోస్కోపీ’ ద్వారా కణజాలాన్ని వదులు చేసి, కదలికలను పెంచే వీలుంటుంది. దాంతో నొప్పి కూడా తగ్గుతుంది. చివరిదైన మూడవ దశలో తప్పనిసరిగా షోల్డర్ జాయింట్ రీప్లేస్‌మెంట్’ చేయవలసి ఉంటుంది. మోకాలి మార్పిడి సర్జరీ ఎలా చేస్తారో, షోల్డర్ రీప్లేస్‌మెంట్ సర్జరీ కూడా అలాగే చేస్తారు. వీటిలో కూడా కోబాల్ట్, క్రోమియం, టైటానియం కృత్రిమ కీళ్లను ఉపయోగిస్తారు. సాధారణంగా 60 నుంచి 80 ఏళ్ల పెద్దల్లోనే భుజాల మార్పిడి చికిత్స అవసరపడుతూ ఉంటుంది. దాంతో పెద్దలు అంత పెద్ద వయసులో సర్జరీ చేయించుకోవడానికి భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇదెంతో సురక్షితమైన సర్జరీ. కేవలం లోకల్ అనస్థీషియాతోనే సర్జరీని ముగించే వీలుంటుంది. సర్జరీ తర్వాత ఒకటి రెండు రోజుల్లో రోగి ఇంటికి వెళ్లిపోవచ్చు. సర్జరీతో నొప్పి తగ్గడంతో పాటు, కదలికలు పెరుగుతాయి. దాంతో కొన్ని వారాల్లోనే దైనందిన కార్యక్రమాలన్నీ చేసుకోగలుగుతారు. రెండు నుంచి మూడు నెలల్లో కారు, బైక్‌లను సైతం నడపగలుగుతారు. అలాగే తేలికపాటి క్రీడలు కూడా ఆడవచ్చు. ఆరు నెలల తార్వత అన్ని రకాల పనులూ చేసుకోవచ్చు. ఈ కృత్రిమ కీళ్లు 15 నుంచి 20 ఏళ్ల పాటు మన్నుతాయి.
ఇవీ కారణాలే!
అధిక బరువు: అధిక బరువు వల్ల చేతుల కదలిక పరిమితమైపోతుంది. దాంతో భుజం కీళ్ల అరుగుదల మొదలవుతుంది.
దెబ్బలు, గాయాలు: ఫ్రాక్చర్లు, దెబ్బలు, ఒత్తిడిలు దీర్ఘకాలంలో భుజం ఆర్థ్రయిటిస్‌కు దారి తీస్తాయి.
ఆటో ఇమ్యూన్ డిజార్డర్: శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మృదులాస్థిని దెబ్బతీయడం ద్వారా ఆర్థ్రయిటిస్ తలెత్తవచ్చు.
అవసరానికి మించి ఉపయోగించడం: క్రీడల్లో ఒకే చేతిని అవసరానికి ఉపయోగించినా ఆర్థ్రయిటిస్ సమస్య తలెత్తవచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే, క్రీడల్లో సరైన పరికరాలు ఉపయోగించాలి. తరచూ బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి.
యువతకు ‘స్టెమ్ లెస్ రీప్లేస్‌మెంట్’
యువతలో తలెత్తే భుజాల్లోని ఆర్థ్రయిటిస్‌కు ‘స్టెమ్ లెస్ రీప్లేస్‌మెంట్’ చికిత్స అందుబాటులో ఉంది. ఈ చికిత్సతో ఎముకను ఎక్కువగా కట్ చేయకుండా చిన్న బంతి లాంటి నిర్మాణాన్ని అమరుస్తారు. ఈ చికిత్స తీసుకున్న వాళ్లకు భవిష్యత్తులో భుజం కీలు మార్పిడి చికిత్స కూడా తేలికవుతుంది.
త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ
ప్రతి వ్యక్తి భుజాల నిర్మాణం భిన్నంగా ఉంటుంది. ఆ నిర్మాణానికి తగిన కీలును అమర్చగలిగితే కీలు ఎక్కువ కాలం మన్నుతుంది. కాబట్టి సదరు వ్యక్తికి తగిన కచ్చితమైన కీలు అమరిక కోసం త్రీడి ప్రింటింగ్ టెక్రాలజీని వైద్యులు ఉపయోగిస్తూ ఉంటారు. కృత్రిమ కీలును ఎముకలో కచ్చితంగా ఫిక్స్ చేయడమే సర్జరీలో కీలకమైన అంశం. అయితే ఎముక ఆకారం, పరిమాణాలు వ్యక్తులను బట్టి భిన్నంగా ఉంటాయి. కాబట్టి, కృత్రిమ ఎముకను ఫిక్స్ చేయడం కోసం త్రీడి ప్రింటింగ్ టెక్సాలజీ దోహదపడుతుంది. ఇందుకోసం మొదట సిటి స్కాన్ చేసి, రోగి భుజం కీలును త్రీడి ప్రింట్ చేయడం జరుగుతుంది. దాంతో రోగి కీలు నిర్మాణంతో పాటు, జరిగిన డ్యామేజీని వైద్యులు కచ్చితంగా గుర్తిస్తారు. అలాగే సర్జరీకి ముందే, ఆ మోడల్ మీద వైద్యులు ట్రయల్ సర్జరీని చేపడతారు. ఇలా ముందస్తు సాధన వల్ల సర్జరీ సమయంలో జాయింట్‌ను అమర్చవలసిన విధానం పట్ల వైద్యులకు అవగాహన ఏర్పడుతుంది, దాంతో పొరపాట్లకు ఆస్కారం లేకుండా పోతుంది. అలాగే అదే సమయంలో రోగికి తగిన చిన్న ప్లాస్టిక్ పరికరాలను కూడా వైద్యులు తయారుచేసుకుంటారు. జిగ్స్ అని పిలిచే ఈ ‘పేషెంట్ స్పెసిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్లను’ సర్జరీ సమయంలో ఉపయోగిస్తారు. వీటిని వాడుకోవడం వల్ల, సర్జరీ సమయంలో కీలును కచ్చితత్వంతో బిగించే వీలు కలుగుతుంది. అలాగే కీలు ఎక్కువ కాలం మన్నడంతో పాటు, కదలికలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
-డాక్టర్ బి. చంద్ర శేఖర్
చీఫ్ ఆఫ్ షోల్డర్ సర్జరీ, సన్‌షైన్ హాస్పిటల్, సికింద్రాబాద్.
Updated Date - 2023-05-16T11:54:36+05:30 IST