Abortions: సొంత తెలివితేటలతో స్వీయ అబార్షన్లు చేసుకుంటే...!
ABN, First Publish Date - 2023-05-02T11:24:56+05:30
మునుపటితో పోలిస్తే, గర్భస్రావం వెసులుబాట్లు అందరికీ అందుబాటులోకొచ్చేశాయి. అయితే వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర సందర్భాల్లో మాత్రమే అనుసరించవలసిన ఈ ప్రక్రియను స్వయంగా అవలంబిస్తే
మునుపటితో పోలిస్తే, గర్భస్రావం వెసులుబాట్లు అందరికీ అందుబాటులోకొచ్చేశాయి. అయితే వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర సందర్భాల్లో మాత్రమే అనుసరించవలసిన ఈ ప్రక్రియను స్వయంగా అవలంబిస్తే, తిరిగి సరిదిద్దలేనంత ఆరోగ్య నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
ప్రస్తుతం ఆస్పత్రుల్లో గర్భిణులకు చేసే ప్రతి స్కాన్ వివరాలూ, తదనంతర ఫాలో అప్ వివరాలూ ప్రభుత్వానికీ చేరుతున్నాయి. అవాంఛిత గర్భాలనూ, ఆడపిల్లల గర్భవిఛ్చితులనూ అడ్డుకోవడం కోసమే ఇలాంటి ప్రొటోకాల్‌ను ప్రభుత్వం అనుసరిస్తోంది. ఒకవేళ స్కాన్‌లో గర్భంలో పెరిగే బిడ్డలో అవకారాలున్నా, ఫోలోపియన్ ట్యూబ్‌లో పిండం పెరుగుతున్నా (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ), సిజేరియన్ కోత పైన పిండం పెరుగుతున్నా (స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ).. ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం గర్భవిచ్ఛిత్తిని అనుమతిస్తుంది. ఇవే కాకుండా పిల్లలను కలిగి ఉండీ పొరపాటున గర్భం దాల్చిన మహిళలు, బలాత్కారానికి గురవడం మూలంగా గర్భం దాల్చిన అమ్మాయిలు, ప్రమాదవశాత్తూ గర్భం దాల్చిన మహిళలు, గర్భం దాల్చిన విషయం తెలియక, ఇతర వ్యాధుల కోసం వాడిన మందుల ప్రభావం పిండం మీద పడిన సందర్భాల్లో కూడా అబార్షన్లు (Abortions) చేయించుకోవచ్చు. అయితే అందుకోసం వాళ్లు కొన్ని నియమాలను పాటించాలి. అవేంటంటే....
గర్భం దాల్చినట్టు అనుమానం ఉన్నవాళ్లు మొదట ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి.
పాజిటివ్ అని తేలిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
సిటి స్కాన్ తప్పనిసరిగా చేయించుకోవాలి.
తర్వాత అబార్షన్ చేయించుకోడానికి ఉన్న బలమైన కారణాన్ని వైద్యులకు వివరించాలి.
వివాహితలు పెద్దల అంగీకారంతో, మైనర్లు తల్లితండ్రుల అంగీకారంతో అబార్షన్లు చేయించుకోవాలి.
అబార్షన్ కోసం వైద్యులు అందించే కిట్‌నే ఉపయోగించాలి.
కోర్సులోని మాత్రలన్నింటినీ వాడాలి.
అబార్షన్ అయిన తర్వాత తిరిగి స్కాన్ చేయించుకోవాలి.
నెలసరి గాడిలో పడే వరకూ వైద్యుల పర్యవేక్షణలో నడుచుకోవాలి.
అబార్షన్ ఎప్పుడు?
అబార్షన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని నియమాలను సూచిస్తోంది. గర్భంలో పెరిగే బిడ్డలో అవకారాలు ఉన్నప్పుడు 22 వారాల గర్భాన్ని అబార్షన్ చేయించుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. అలాగే కచ్చితమైన కారణం ఉనప్పుడు (పిండంలో అవకారాలు) 12 వారాల తర్వాత ఇద్దరు గైనకాలజిస్టుల సంతకాలతో అబార్షన్‌కు చేయించుకోవచ్చనే నియమం కూడా ఉంది. అయితే స్వచ్ఛంద అబార్షన్లకు వైద్యులు గర్భంలో పెరిగే పిండం వయసు ఆధారంగా ఒక ప్రొటోకాల్‌ను అనుసరిస్తారు. ఏడు వారాల లోపు పిల్స్‌తో అబార్షన్ చేసి, రిపీట్ స్కాన్ చేస్తారు. 7 నుంచి 10 వారాల గర్భాన్ని నివారించుకోవడానికి డి అండ్ సిని అనుసరిస్తారు. 10 వారాలు దాటితే టాబ్లెట్లతో అబార్షన్ చేసి, స్కాన్ చేసి, ఏవైనా ముక్కలు మిగిలిపోతే, డి అండ్ సి కూడా చేయవలసి ఉంటుంది.
సొంత అబార్షన్లు ప్రమాదకరం
అబార్షన్ పిల్స్ అనేవి సర్వత్రా దొరుకుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే అబార్షన్ కిట్‌లో ఉండే మాత్రలు సమగ్రమైనవి. బయట దొరికే అబార్షన్ మాత్రలు అసమగ్రంగా ఉంటాయి. వాటిని తీసుకుని రక్తస్రావం కనిపించిన తర్వాత అబార్షన్ అయిపోయిందిలే అనుకుంటే పొరపాటు. ఎక్కువ సందర్భాల్లో పిండం పూర్తిగా బయటకు రాకపోవచ్చు. కొన్ని ముక్కలు గర్భాశయంలోనే ఉండిపోవచ్చు. ఇన్‌ఫెక్షన్లకు గురి కావచ్చు. విపరీతమైన రక్తస్రావంతో షాక్‌లోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా జరగవచ్చు. ఒకవేళ ఫెలోపియన్ ట్యూబులో పిండం పెరుగుతుంటే (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ), అబార్షన్ పిల్స్‌తో సక్రమంగా అబార్షన్ అవక, రెండు లీటర్ల రక్తస్రావం జరగవచ్చు. రెండోసారి గర్భం దాల్చినప్పుడు కూడా పిండం సరైన స్థానంలో ఇంప్లాంట్ అవకపోవచ్చు. ఒకసారి గర్భాశయానికి ఇన్‌ఫెక్షన్ సోకితే, రెండోసారి గర్భధారణ సమస్యగా మారవచ్చు. బ్లీడింగ్ వల్ల రక్తహీనత ఏర్పడి సెకండరీ కాంప్లికేషన్స్ తలెత్తవచ్చు. గుండె మీద ప్రభావం పడవచ్చు. కాబట్టి సొంత అబార్షన్ ప్రయత్నాలు మానుకోవాలి.
అబార్షన్ అవసరమా?
గర్భస్రావం నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయం సరైనదేనా? గర్భస్రావం అవసరమా? అనే విషయాన్ని ఎవరికి వారు ఆలోచించుకోవాలి. గర్భధారణే క్లిష్టంగా మారిపోతున్న ఈ రోజుల్లో వచ్చిన గర్భాన్ని బలవంతంగా తొలగించుకోవడం ఎంత వరకూ సమంజసం? ఆ పరిస్థితి తలెత్తకుండా గర్భధారణను నియంత్రించే కుటుంబ నియంత్రణ సాధనాలెన్నో అందుబాటులో ఉన్నప్పుడు, మొదట వాటికి ప్రాధాన్యం ఇవ్వడం మేలు. ఒకవేళ అనుకోకుండా, ఊహించని రీతిలో గర్భధారణ జరిగితే, దాన్ని కొనసాగించడానికే మొగ్గు చూపాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అబార్షన్‌ను ఆశ్రయించాలి. అబార్షన్ నిర్ణయం తీసుకున్నప్పుడు, వైద్యులను సంప్రతించి, వాళ్లు అందించే అబార్షన్ కిట్‌నే ఉపయోగించాలి. అలాంటప్పుడే పూర్తి అబార్షన్ అయిపోయి, తదనంతర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్
వీటిని లైంగికంగా కలిసిన 72 గంటల లోపు ఉపయోగించాలి. కానీ అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవలసిన ఈ పిల్స్‌ను నిరంతరంగా వాడుకోవడం వల్ల నెలసరి క్రమం తప్పుతుంది. ఇవి హార్మోన్ మాత్రలు కాబట్టి రక్తం గడ్డకట్టే తత్వం వాటికి ఉంటుంది. సాధారణంగా నెలసరి తప్పడాన్ని, గర్భధారణకు సూచనగా భావిస్తూ ఉంటారు. అయితే కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడకం మూలంగా నెలసరి క్రమం తప్పుతూ ఉంటుంది. దాంతో ఒకవేళ గర్భం దాల్చినా, నెలసరి క్రమం తప్పిందనే భ్రమలో ఉండిపోయి, అంతిమంగా అబార్షన్లకు పరుగులు పెడుతూ ఉంటారు. ఇలా అబార్షన్లకు ఈ పిల్స్ పరోక్షంగా దోహదపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ వాడకాన్ని అత్యవసర సమయాలకే పరిమితం చేయాలి. వాటి వాటకం మానేసినప్పుడు విత్‌డ్రాయల్ బ్లీడింగ్ కూడా సర్వసాధారణమే! ఇలాంటప్పుడు భయానికి లోను కాకుండా వైద్యులను సంప్రతించి, నెలసరి సక్రమంగా వచ్చేలా చికిత్స తీసుకోవాలి.
కేస్ స్టడీ
గర్భస్రావం కోసం సొంతగా అబార్షన్ పిల్స్ వాడిన అమ్మాయి రక్తస్రావం అయిపోగానే అబార్షన్ అయిపోయిందని ఊరుకుంది. అయితే గర్భం లోపల ఒక చిన్న పార్టికల్ మిగిలిపోయి, అది గర్భాశయంలో అతుక్కుని ఆర్టెరీ, వెయిన్ మాల్‌ఫార్మేషన్ జరుగుతుంది. దాంతో రక్తస్రావం తీవ్రమైపోయింది. అలాంటి పరిస్థితిలో యుటెరైన్ ఆర్టెరీ ఎంబొలైజేషన్ ద్వారా గర్భసంచికి జరిగే రక్తప్రసరణను ఆపి, గర్భాశయంలో మిగిలిపోయిన ముక్కను తొలగించడం జరిగింది. నిజానికి గర్భం దాల్చిన వెంటనే గర్భవిచ్ఛిత్తి కోసం వైద్యులను కలిస్తే, ఇంతటి ప్రమాదం జరగకుండా ఉండేది.
స్కాన్ తప్పనిసరి
పిండం గర్భాశయంలో నాటుకునే ప్రదేశం ఎంతో కీలకం. ఒక్కోసారి ఫోలిపియన్ ట్యూబులో లేదా సిజేరియన్ కోత దగ్గర పిండం నాటుకుంటూ ఉంటుంది. ఇవి రెండూ ప్రమాదకరం. కాబట్టి స్కాన్‌లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తే, వైద్యులే అబార్షన్‌ను సూచిస్తారు.
డాక్టర్ల పర్యవేక్షణలో...
ఎటువంటి కాంప్లికేషన్లు లేనివాళ్లు రిపీట్ స్కాన్‌లు కూడా చేయించుకుని, వైద్యులు సూచించిన పద్ధతి ప్రకారం అబార్షన్ చేయించుకుంటే భవిష్యత్తులో గర్భధారణకు ఎటువంటి ఆటంకాలూ ఉండవు. గర్భవిచ్ఛిత్రి ప్రక్రియ మొత్తం ఒక క్రమశిక్షణతో సాగినంత వరకూ ఎటువంటి ప్రమాదం ఉండదు.
-డాక్టర్ పూజితా దేవి సూరనేని,
కన్సల్టెంట్ అబ్ట్సెట్రీషియన్,
గైనకాలజిస్ట్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్, బర్త్‌రైట్ బై రెయిన్‌బో,
నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్.
Updated Date - 2023-05-02T11:24:56+05:30 IST