Fever: క్రోసిన్, పారాసెటమాల్‌తో సరిపెట్టేసుకుంటే మాత్రం..!
ABN, First Publish Date - 2023-08-01T11:37:53+05:30
జ్వరమొస్తే వెంటనే డాక్టర్లని కలిసే వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. క్రోసిన్, పారాసెటమాల్‌తో తగ్గిపోయే జ్వరానికి డాక్టరును కలవడం పిచ్చి పని అని అనుకునేవాళ్లూ ఉన్నారు. కానీ అది ఎలాంటి జ్వరమో తెలుసుకోకపోతే ఎలా? ఇది వానాకాలం కాబట్టి వాటితో పాటు దంచి కొట్టే జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
జ్వరమొస్తే వెంటనే డాక్టర్లని కలిసే వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. క్రోసిన్, పారాసెటమాల్‌తో తగ్గిపోయే జ్వరానికి డాక్టరును కలవడం పిచ్చి పని అని అనుకునేవాళ్లూ ఉన్నారు. కానీ అది ఎలాంటి జ్వరమో తెలుసుకోకపోతే ఎలా? ఇది వానాకాలం కాబట్టి వాటితో పాటు దంచి కొట్టే జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
జ్వరం...లో గ్రేడ్ (99.5 డిగ్రీలు) ఉంటే ఫర్వాలేదు. కానీ శరీర ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతూ 101 డిగ్రీలకు మించిపోయి పారాసిటమాల్ తీసుకున్నప్పటికీ తగ్గుతూ, పెరుగుతూ, అదే పరిస్థితి రెండు రోజులపాటు కొనసాగితే వైద్యులను కలవక తప్పదు. జ్వరంతోపాటు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసం, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, ఒంటి మీద ఎర్రని మచ్చలు, దగ్గు, జలుబు, తలనొప్పి, చలి మొదలైన లక్షణాలు ఉన్నా తీవ్రంగా పరిగణించాల్సిందే!
లక్షణాలే కీలకం
విపరీతమైన జ్వరంతోపాటు జలుబు, దగ్గు, తలనొప్పి, ఆయాసం, చమటలు పడుతుంటే వైరల్ ఫీవర్‌గా భావించాలి. ఈ జ్వరంలో ఒళ్లంతా ఎర్రటి మచ్చలు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణం ఉంటే వైరల్ హెమరేజింగ్ ఫీవర్ అనుకోవాలి. ఈ జ్వరం తాలూకు వైరస్, దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇక జ్వరంతోపాటు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, కామెర్లు, గుండె వేగం తగ్గడం మొదలైనవి టైఫాయిడ్ లక్షణాలు.
డెంగ్యూతో డంగైపోవాలస్సిందే!
విపరీతమైన జ్వరంతోపాటు కీళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులు వేధిస్తాయి. కొందరిలో రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య త్వరితంగా పడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు విరేచనం, మూత్రంలో రక్తం కనిపిస్తుంది. ముక్కు నుంచి, లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావమవుతుంది. కొందర్లో పొట్టలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇది అంతర్గత రక్తస్రావానికి సూచన. తలనొప్పితోపాటు శరీరంలో ఒక వైపు పక్షవాతం లక్షణాలు కనిపిస్తే మెదడులో రక్తస్రావానికి సూచనగా భావించాలి. అత్యవసర వైద్య సహాయం అవసరమైన అత్యంత తీవ్రమైన పరిస్థితి ఇది.
మలేరియా మత్తు
జ్వరంతోపాటు మత్తు, వాంతులు, తీవ్రమైన తలనొప్పి, చూపులో తేడా లాంటి లక్షణాలు ఉంటాయి. ఒకరోజు శరీర ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా పెరిగిపోయి, మరుసటి రోజు తగ్గిపోవడం... మళ్లీ పెరిగిపోవడం.... ఇలా జ్వరంలో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటే దాన్ని మలేరియా జ్వరంగా భావించాలి. మలేరియా ఫాల్సిఫారం లేదా వైవాక్స్ అనే రెండు రకాల జ్వరాలుంటాయి. వీటిలో ఫాల్సిఫారం తాలూకు మలేరియా మెదడుకు కూడా పాకి ‘సెరెబ్రల్ మలేరియా’నూకలిగిస్తుంది.
చికిత్వ జ్వరాన్ని బట్టి
డెంగ్యూ జ్వరానికి సపోర్టివ్ ట్రీట్మెంట్ అవసరం. ఈ జ్వర చికిత్సలో యాంటీ వైరల్ మందులు వాడవలసిన అవసరం ఉండదు. నీరసం ఉంటే సెలైన్ ఇస్తూ, జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ ఇస్తూ వైద్యులు పరిస్థితిని అదుపులో తీసుకొస్తారు. నీరసం తగ్గించడానికి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు కూడా ఇవ్వవలసి రావచ్చు. ఈ జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలంటే పోషకాహారంతోపాటు ఎక్కువగా నీళ్లు, పళ్లరసాలు తీసుకోవాలి. తగినంత ద్రవాహారం తీసుకోకపోతే చికిత్స తదనంతరం శరీరంలో మిగిలి ఉండే వైరస్ క్రమేపీ ప్లేట్‌లెట్లను నాశనం చేస్తుంది.
మలేరియా జ్వరం ఉన్నా మాత్రలు మింగే స్థితిలో ఉంటే నోటి మాత్రలతోనే మలేరియా జ్వరాన్ని అదుపు చేయవచ్చు. అలాకాకుండా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఉంటే ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు అవసరం అవుతాయి. మలేరియా వైవాక్స్ వైరస్ భిన్నంగా ప్రవర్తిస్తుంది. చికిత్సతో వ్యాధి తగ్గినా, వైవాక్స్ వైరస్ కాలేయంలో ఉండిపోయి, కొంతకాలం తర్వాత వ్యాధి తిరగబెడుతుంది. కాబట్టి మలేరియా వైవాక్స్‌కు అదనపు మందులు అవసరమవుతాయి.
టైఫాయిడ్‌లో లక్షణాలను అదుపుచేసే సింప్టమాటిక్ ట్రీట్మెంట్‌తోపాటు, జ్వరం తగ్గించే యాంటీ బ్యాక్టీరియల్ మందులు కూడా అవసరమవుతాయి.
సైనసైటిస్ ఫీవర్‌లో ఏ కారణంగా జ్వరం వచ్చిందో ఆ కారణాన్ని గుర్తించి చికిత్స చేస్తే జ్వరం అదుపులోకి వస్తుంది. ప్రారంభంలో ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడం కోసం కనీసం 5 నుంచి 7 రోజులపాటు యాంటీ బయాటిక్స్‌ను వైద్యులు సూచిస్తారు. అయితే సైన్‌సలలోని చీము బయటకు రాకుండా మిగిలిపోతే, చిన్నపాటి సర్జరీ చేయవలసి ఉంటుంది. తరచుగా సైనసైటిస్ వస్తూ ఉండేవాళ్లకు సర్జరీ అవసరమవుతుంది. నాసల్ డీవియేషన్ ఉన్న వాళ్లుకూ సర్జరీ అవసరమే!
వ్యాక్సిన్లు ఉన్నాయి!
న్యూమోవ్యాక్: ఆస్తమా, ఎలర్జీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న 65 ఏళ్ల లోపు వాళ్లు, ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో ఊపిరితిత్తులకు సంబంధించిన న్యుమోనియా దరి చేరకుండా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులూ లేనివాళ్లు 65 ఏళ్ల తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 65 ఏళ్ల లోపు హృద్రోగులు, మధుమేహులు కూడా ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇన్‌ఫ్లుయెంజా: ఈ వ్యాధికీ వ్యాక్సిన్ ఉంది. దీన్ని తీసుకుంటే ఇన్‌ఫ్లుయెంజా ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ పొందవచ్చు.
టైఫాయిడ్: దూర ప్రాంతాలు, కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేసేవాళ్లు అక్కడ ప్రబలిన టైఫాయిడ్ సోకకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే పదే పదే టైఫాయిడ్ బారిన పడుతున్నా, ఈ వ్యాక్సిన్ తీసుకుని రక్షణ పొందవచ్చు.
చల్లని వాతావరణంలో వేధించే ఫీవర్
వానా కాలంలో ‘సైనసైటిస్ ఫీవర్’ వేధిస్తుంది. జ్వరం, తలనొప్పి, జలుబు, ముందుకు వంగినప్పుడు తలనొప్పి ఎక్కువవడం, తల బరువుగా ఉండడం ఈ సమస్య ప్రధాన లక్షణాలు. సైనస్‌లు సున్నితంగా ఉన్నా, నాసికా ద్వారం వంకరగా ఉన్నా (డీవియేషన్ ఆఫ్ నాసల్ సెప్టమ్) తరచుగా జలుబు చేస్తూ, క్రమేపీ ఇన్‌ఫెక్షన్ పెరిగిపోయి సైనసైటిస్ ఫీవర్‌గా మారుతుంది.
పసికందుల్లో, గర్భిణిల్లో...
సంవత్సరంలోపు పసికందుల్లో ఇమ్యూనిటీ తక్కువ. దాంతో జ్వరంతోపాటు ఇతరత్రా సమస్యలూ తలెత్తవచ్చు. కాబట్టి పెద్దలతో పోలిస్తే పసికందుల విషయంలో అందుకు 20 రెట్లు జాగ్రత్తగా ఉండాలి. పసిపిల్లల్లో లక్షణాలను గుర్తించడం కష్టం కాబట్టి రక్తపరీక్ష తప్పనిసరి అవుతుంది. ఫలితాన్ని బట్టి స్వల్ప మోతాదు మందులతో చికిత్స చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు.
గర్భిణుల్లో మొదటి మూడు నెలల్లో గర్భం లోపల బిడ్డ అవయవాలు రూపొందుతూ ఉంటాయి. రెండు, మూడు త్రైమాసికాలతో పోలిస్తే, మొదటి మూడు మాసాల్లో వీలైనంత తక్కువ మోతాదులో మందులు వాడవలసి ఉంటుంది. మొదటి మూడు మాసాల్లో గర్భిణికి మామూలు జ్వరాలతోపాటు మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలూ బాధించవచ్చు. అయితే వైద్యులు వీళ్లకు మందుల మోతాదు, సంఖ్య కూడా తగ్గించి వాడమని సూచిస్తారు.
జ్వరం మాత్రలు వాడవచ్చా?
ఒక రోజులో మన శరీర ఉష్ణోగ్రతలో ఒక డిగ్రీ వ్యత్యాసం వస్తూ ఉంటుంది. ఉదయం 98.5 డిగ్రీలు ఉంటే సాయంత్రం 99.5 డిగ్రీలు ఉంటుంది. ప్రతి ఒక్కర్లో ఇది సహజం. కాబట్టి బాడీ టెంపరేచర్ 99.5 డిగ్రీలకు మించితేనే జ్వరంగా భావించాలి. జ్వరం తీవ్రత 101 డిగ్రీలు దాటితేనే జ్వరం మాత్రలు వాడాలి. ఒకవేళ అంతకంటే తక్కువ టెంపరేచర్ ఉండి, ఒళ్లు నొప్పులు కూడా ఉంటే, పారాసెటమాల్‌తోపాటు ఒళ్లు నొప్పులు తగ్గించే మాత్ర వేసుకోవచ్చు. అయితే 101 డిగ్రీల కంటే తక్కువ జ్వరం మాత్రమే ఉంటే, మందులు వాడవలసిన అవసరం లేదు. ఒకవేళ జ్వరం 101 డిగ్రీలకు చేరుకుంటే పారాసెటమాల్ మాత్రలు వాడవచ్చు. అయితే రోజు మొత్తంలో వాడదగిన పారాసెటమాల్ పరిమాణం 4 గ్రాములు. అయితే మద్యం అలవాటు, కాలేయ సమస్యలు ఉన్నవాళ్లు, డ్రగ్స్ కారణంగా కాలేయం పాడయినవాళ్లు రోజుకి కేవలం 2 గ్రాముల పారాసెటమాల్ మోతాదుకే పరిమితమవ్వాలి. అంటే రోజుకు మూడుసార్లు పారాసెటమాల్ 600 మిల్లీగ్రాముల మాత్రలు వాడవచ్చు. అయితే రెండు రోజులకు మించి మందులకు అదుపు కాకుండా జ్వరం, ఇతరత్రా లక్షణాలు వేధిస్తే, ఆలస్యం చేయకుండా డాక్టరు కలవాలి.
Updated Date - 2023-08-01T11:37:53+05:30 IST