Anju-Nasrullah: అంజుకి బహుమతుల పంట.. స్థలం, నగదుతో పాటు మరెన్నో.. ఆ పని చేసినందుకే!
ABN, First Publish Date - 2023-07-30T17:52:01+05:30
అంజు-నస్రుల్లా ప్రేమ వ్యవహారంలో రోజుకో ఊహించని పరిణామం చోటు చేసుకుంటోంది. మొదట్లో అంజు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన పాక్ ప్రియుడు నస్రుల్లాని వివాహం చేసుకుందని...
అంజు-నస్రుల్లా ప్రేమ వ్యవహారంలో రోజుకో ఊహించని పరిణామం చోటు చేసుకుంటోంది. మొదట్లో అంజు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన పాక్ ప్రియుడు నస్రుల్లాని వివాహం చేసుకుందని, మతం కూడా మార్చుకుందని వార్తలొచ్చాయి. అప్పుడు ఆ వార్తలు ఫేక్ అని, తమకు పెళ్లి కాలేదని, తాము మంచి స్నేహితులమేనంటూ ఇద్దరూ ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను మతం మారలేదని, ఇండియాకి తిరిగొస్తున్నానని కూడా అంజు పేర్కొంది. కానీ, ఆ వెంటనే అంజు తన మనసు మార్చుకుంది. నస్రుల్లాని పెళ్లి చేసుకొని, అక్కడే సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యింది. ఇందుకు ఇస్లాం మతం స్వీకరించింది కూడా!
ఈ నేపథ్యంలో ఒక వ్యాపారవేత్త ముందుకొచ్చి.. అంజుకి భారీ బహుమతులు సమర్పించాడు. అతని పేరు మొహసీన్ ఖాన్ అబ్బాసి. పాక్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సీఈవో అయిన అతను.. అంజుకి 50 వేల పాకిస్తానీ నగదు, 272 చదరపు అడుగుల స్థలంతో పాటు మరికొన్ని గిఫ్టులు ఇచ్చాడు. పాకిస్తాన్లో అంజుకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, తాను పరాయి దేశంలో కాకుండా తన సొంత దేశంలోనే ఉన్నానన్న భావన ఆమెకు కలగాలన్న ఉద్దేశంతోనే ఈ బహుమతులు ఇవ్వడం జరిగిందని అతను పేర్కొన్నాడు. అంజు ఇస్లాం మతం స్వీకరించడంతో పాటు నస్రుల్లాని పెళ్లి చేసుకుంది కాబట్టి.. ఆమెను కోడలిగా స్వీకరిస్తున్నామని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు ఇతర వ్యాపారవేత్తలు, పాక్ ప్రజలు ఆమెకు మద్దతుగా నిలవాలని కోరాడు.
కాగా.. ఇండియాలో అంజుకి ఆల్రెడీ పెళ్లయ్యింది. భర్తతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో ఆమెకు విభేదాలున్న మాట వాస్తవమే కానీ, విడాకులు మాత్రం తీసుకోలేదు. ఇంతలో అంజుకి ఫేస్బుక్లో నస్రుల్లా పరిచయం అవ్వడం, అతనితో ప్రేమలో పడటం, అతడ్ని పెళ్లి చేసుకోవడం కోసం పాకిస్తాన్కి వెళ్లడం జరిగింది. మరోవైపు.. తామింకా విడాకులు తీసుకోలేదు కాబట్టి, అంజు ఇంకా తన భార్యేనని ఇండియాలోని ఆమె భర్త అర్వింద్ కుమార్ అంటున్నాడు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని, విచారణ చేయాలని కోరుతున్నాడు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో అంజు-నస్రుల్లా వ్యవహారంలో ఇంకా మరెన్నో ట్విస్టులు వెలుగు చూసేలా కనిపిస్తోంది.
Updated Date - 2023-07-30T18:09:55+05:30 IST