Israel-Hamas War: శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 51 మంది మృతి.. ఇప్పటివరకు ఎన్ని వేల మంది చనిపోయారంటే..?
ABN, First Publish Date - 2023-11-05T08:18:56+05:30
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ యుద్ధం మొదలై నెల రోజులు కావొస్తుంది. కానీ ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా కనిపించడంలేదు. ముఖ్యంగా గాజాను పూర్తిగా నాశనం చేసే వరకు ఇజ్రాయెల్ వదిలిపెట్టేలా లేదు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ యుద్ధం మొదలై నెల రోజులు కావొస్తుంది. కానీ ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా కనిపించడంలేదు. ముఖ్యంగా గాజాను పూర్తిగా నాశనం చేసే వరకు ఇజ్రాయెల్ వదిలిపెట్టేలా లేదు. ఈ క్రమంలోనే గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులను కొనసాగిస్తోంది. నిత్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా గాజా ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం రెచ్చిపోతుంది. యుద్ధం కారణంగా కూడు, గూడు, గుడ్డ కోల్పోయి శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న అమాయకులను కూడా ఇజ్రాయెల్ సైన్యం వదిలిపెట్టడంలేదు. శనివారం రాత్రి సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని మాఘాజీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో శరణార్థి శిబిరంలోని కనీసం 51 మంది పాలస్తీయన్లు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) శనివారం రాత్రంతా గాజాపై బాంబు దాడులను కొనసాగించింది. ముఖ్యంగా గాజాలోని ఉత్తర ప్రాంతంలో దాడులను తీవ్రతరం చేసింది. ఈ దాడుల్లో గాజాలోని అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ భూబలగాలు కూడా గాజాలోని హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని తమ దాడులను కొనసాగిస్తున్నాయి.
గాజాలో హమాస్ అధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ దాడుల్లో గత రోజు 231 మంది చనిపోయారు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల కారణంగా 9,488 మంది పాలస్తీయన్లు ప్రాణాలు విడిచారు. మరణించిన వారిలో 3,900 మంది చిన్నారులు, 2,509 మంది మహిళలు ఉన్నారు. 24 వేల మందికి పైగా గాయపడ్డారు. వెస్ట్ బ్యాంకు ప్రాంతంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న ఘర్షణలో కనీసం 140 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా గాజాలో మానవతా సహాయం అదించేందుకు తక్షణ కాల్పుల విరమణను తాము చురుకుగా కొనసాగిస్తున్నామని అమెరికా పేర్కొంది. అలాగే శనివారం ఓ అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 15 మంది చనిపోగా.. 60 మంది గాయపడ్డారు. గాజా నగరంలోని అల్-షిఫా హాస్పిటల్ సమీపంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ ఘటనపై ఇటు హమాస్, అటు ఇజ్రాయెల్ పరస్పరం విరుద్ధ ప్రకటనలను విడుదల చేశాయి. ‘‘ఉత్తర గాజా నుంచి క్షతగాత్రులను తరలిస్తున్న అంబులెన్స్‌పై శుక్రవారం ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 15 మంది చనిపోయారు. 60 మంది గాయపడ్డారు.’’ అని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘‘హమాస్ టెర్రరిస్ట్‌లు ఉపయోగిస్తున్న అంబులెన్స్‌ను గుర్తించి దాడి చేశాం. ఈ దాడిలో హమాస్ ఫైటర్లు చనిపోయారు. ఉగ్రవాదులు, ఆయుధాలను బదిలీ చేయడానికి అంబులున్స్‌లను ఉపయోగిస్తున్నారు.’’ అని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
Updated Date - 2023-11-05T08:18:58+05:30 IST