కైలాస దేశ ప్రధానిగా రంజితకు చాన్సా?
ABN, First Publish Date - 2023-10-07T05:04:44+05:30
వివాదాస్పద స్వామి నిత్యానంద.. తాను ఉంటున్న కైలాశ దేశానికి తన ప్రియశిష్యురాలు, సినీ నటి రంజితను ప్రధానమంత్రిగా ప్రకటించడాన్ని ఆయన శిష్య బృందమే వ్యతిరేకిస్తోంది.
నిత్యానంద శిష్య బృందం ఆగ్రహం
చెన్నై, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వివాదాస్పద స్వామి నిత్యానంద.. తాను ఉంటున్న కైలాశ దేశానికి తన ప్రియశిష్యురాలు, సినీ నటి రంజితను ప్రధానమంత్రిగా ప్రకటించడాన్ని ఆయన శిష్య బృందమే వ్యతిరేకిస్తోంది. నిత్యానందకు వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసిన రంజితకు గత జూలైలో ప్రధాని పదవిని అప్పగించారు. ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి రంజిత ధోరణి పూర్తిగా మారిపోయిందని, తానే దేశాధ్యక్షురాలు అనే భావనతో శిష్యబృందాన్ని బెదిరిస్తూ కైలాస దేశంలోని సంస్థలను తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవాలని కుట్ర పన్నుతోందని శిష్యులు ఆరోపిస్తున్నారు. శిష్యులంతా ప్రధాని రంజితను వ్యతిరేకిస్తుండడం నిత్యానందకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి రంజిత నిత్యానందతో పోటీపడేలా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఆ వీడియోలను కైలాస దేశం వెబ్‌సైట్‌లో పెట్టేవారు. శిష్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆమె ఆధ్యాత్మిక ప్రసంగాల వీడియోలు ప్రసారం కూడా నిలిపేసినట్లు తెలిసింది. మూడేళ్ల క్రితం భారత దేశం నుంచి పరారైన నిత్యానంద ఈక్వెడార్ ప్రాంతంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసుకుని దానికి ‘కైలాస దేశం’ అని పేరు పెట్టారు.
Updated Date - 2023-10-07T05:04:44+05:30 IST