Israel-Hamas War: తమ చెరలో ఉన్న ఇద్దరు అమెరికన్లను వదిలేసిన హమాస్.. బాధితుల వివరాలు ఇదిగో!
ABN, First Publish Date - 2023-10-21T09:12:16+05:30
గాజాలో తమ చెరలో ఉన్న 200 మంది బందీల్లో ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం విడుదలచేశారు. జుడిత్ తై రానన్, నటాలీ శోషనా రానన్ అనే తల్లికూతుళ్లను విడుదల చేసినట్లు హమాస్ మిలిటెంట్లు అధికారులు వెల్లడించారు.
గాజాలో తమ చెరలో ఉన్న 200 మంది బందీల్లో ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం విడుదలచేశారు. జుడిత్ తై రానన్, నటాలీ శోషనా రానన్ అనే తల్లికూతుళ్లను విడుదల చేసినట్లు హమాస్ మిలిటెంట్లు అధికారులు వెల్లడించారు. విడుదలైన ఇద్దరు మహిళలు శుక్రవారం ఆలస్యంగా ఇజ్రాయెల్‌కు చేరుకున్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. దీంతో కతార్, ఈజిప్టుల కృషి ఫలించిందని చెప్పుకోవాలి. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిపించేందుకు కతార్, ఈజిప్ట్ దేశాలు కృషి చేశాయి. హమాస్ పాలకులతో సంప్రదింపులు జరిపాయి. ఈ క్రమంలోనే మానవతా కోణంలో భాగంగా ఆమెరికాకు చెందిన తల్లీకూతుళ్లను విడుదల చేశారు. భవిష్యత్‌లో మరింత మందిని విడుదల చేసే అవకాశాలున్నాయి. విడుదలైన తల్లీకూతుళ్లను గాజా సరిహద్దులో ఓ ఇజ్రాయెల్ రాయబారి కలుసుకున్నారు. వారిని సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరానికి తరలించారు. వారిని కలవడానికి వారి కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్-గాజా సరిహద్దు సమీపంలోని నహాల్ ఓజ్ కిబ్బట్జ్ నుంచి అమెరికన్ తల్లి, కుమార్తెను హమాస్ సైన్యం బందీలుగా తీసుకెళ్లింది. ఆ సమయంలో వారు ఇజ్రాయెల్‌లో సెలవులో ఉన్నట్లు సమాచారం.
అయితే వారి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలియలేదు. మరోవైపు ఇద్దరు అమెరికన్లను విడుదల చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆనందం వ్యక్తం చేశారు. విడుదలైన ఇద్దరు మహిళలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కాగా ఈ నెల 7న ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసిన హమాస్ మిలిటెంట్లు ఏకంగా 200 మందిని బందించి గాజాకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లిన వారిలో ఇజ్రాయెల్ పౌరులే కాకుండా ఇదర దేశాల వారు కూడా ఉన్నారు. అందులోనే తాజాగా విడుదలైన అమెరికాకు చెందిన తల్లీ కూతుళ్లు కూడా ఉన్నారు. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నెలకొంది. ఇరువైపుల నుంచి వైమానిక దాడులు జరగడంతో పలు ప్రాంతాలు పూర్తిగా నాశయమయ్యాయి. ఈ యుద్ధంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ దాడిలో 1,400కుపైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. ఇజ్రాయెల్ దాడిలో 4 వేలకు పైగా గాజా పౌరులు ప్రాణాలు విడిచారు. మరోవైపు గాజాలో హమాస్ చెరలో దీలుగా ఉన్న వారిలో చాలా మంది ప్రాణాలతోనే ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో మరణించిన ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను సైతం గాజా స్ట్రిప్‌కు తరలించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిలో 20 మందికిపైగా మైనర్లు, 10 నుంచి 20 మంది 60 ఏళ్లు నిండిన వృద్ధులు ఉన్నారని తెలిపింది.
Updated Date - 2023-10-21T13:30:06+05:30 IST