India vs Canada: హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు.. భారత్, కెనడా మధ్య విభేదాలకు కారణాలు ఏంటి?
ABN, First Publish Date - 2023-09-19T15:40:37+05:30
జీ20 సమావేశాల తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు బలపడుతాయని అనుకుంటే.. అందుకు భిన్నంగా విభేదాలు రాజుకున్నాయి. ఇక సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. జూన్ 18వ తేదీన ఖలిస్తానీ ఉగ్రవాది...
జీ20 సమావేశాల తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు బలపడుతాయని అనుకుంటే.. అందుకు భిన్నంగా విభేదాలు రాజుకున్నాయి. ఇక సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. జూన్ 18వ తేదీన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చడంలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించడంతో.. ఇరుదేశాల మధ్య వివాదాలు మరింత ముదిరాయి. అంతేకాదు.. ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా.. భారత్ సైతం కెనడా దౌత్యాధికారిని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో తమ హస్తం ఉందని ట్రూడో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని భారత్ స్పందించింది. ఈ నేపథ్యంలోనే.. నిజ్జర్ ఎవరన్న విషయం చర్చనీయాంశంగా మారింది.
ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ భారతదేశంలోని జలంధర్‌లో ఉన్న భర్‌సింగ్‌పురా గ్రామానికి చెందినవాడు. 1997లో ఇతను పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్లాడు. అక్కడ ప్లంబర్‌గా వృత్తిలో చేరాడు. ఇతనికి పెళ్లయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కెనడాలో అడుగుపెట్టినప్పటి నుంచే అతడు ఖలిస్తానీ వేర్పాటువాదులతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకున్నాడు. ఖలిస్టాన్ టైగర్ ఫోర్స్ (KTF) (నిషేదిత ఉగ్రవాద సంస్థ) ఏర్పాటు వెనుక అతడే మాస్టర్ మైండ్. అంతేకాదు.. సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ)లోనూ అతడు సభ్యుడు. 2007లో పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిజ్జర్ మోస్ట్ వాంటెడ్. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా, 40 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 2009లో రాష్ట్రీయ సిక్ సంగత్ అధ్యక్షుడు రూల్డా సింగ్ హత్యలోనూ నిజ్జర్ పాత్ర ఉంది. 2020లో నిజ్జర్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.
గతేడాది జులైలో జలంధర్‌లో హత్యకావింపబడిన హిందువు పూజారి కేసులోనూ నిజ్జర్ ప్రమేయం ఉందని తేలడంతో.. అతడ్ని పట్టిస్తే రూ.10 లక్షల బహుమతి ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రకటించింది. అంతేకాదు.. కెనడా, యూకే, అమెరికాలో ఉన్న భారత దౌత్య కార్యాలయాలపై జరిగిన దాడుల వెనుక నిజ్జర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. అయితే.. జూన్ 18వ తేదీన హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్చి చంపబడ్డాడు. సర్రేలోని గురుద్వారా వెలుపల అతనిపై పలుమార్లు కాల్పులు జరిపారు. ఇతని హత్య తర్వాత ఖలిస్తానీ వేర్పాటువాదులు మరింత రెచ్చిపోయారు. గత నెల కొలంబియాలోని సర్రేలో వాళ్లు ఒక మందిరాన్ని ధ్వంసం చేసి.. ‘‘జూన్ 18న జరిగిన హత్య (నిజ్జర్ హత్య)పై కెనడా దర్యాప్తు చేస్తుంది’’ అని రాశారు. కెనడా ప్రధాని ట్రూడో కూడా అదే వాదనని తెరమీదకి తేవడంతో.. ఇరు దేశాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
Updated Date - 2023-09-19T15:40:37+05:30 IST