Sheikh Nawaf: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ కన్నుమూత.. కారణం ఇదే!
ABN, Publish Date - Dec 16 , 2023 | 05:10 PM
కువైట్ పాలక ఎమిర్ (నోబెల్ టైటిల్) షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా (86) కన్ను మూశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ మీడియా శనివారం స్పష్టం చేసింది. గత నెలలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన..
Sheikh Nawaf Dies At 86: కువైట్ పాలక ఎమిర్ (నోబెల్ టైటిల్) షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా (86) కన్ను మూశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ మీడియా శనివారం స్పష్టం చేసింది. గత నెలలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. చికిత్స పొందుతూ కన్ను మూసినట్టు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. షేక్ నవాఫ్ మృతి పట్ల తీవ్ర విచారంతో తాము సంతాపం తెలియజేస్తున్నామని కువైట్ స్టేట్ టెలివిజన్‌లో ప్రసారమైన ఒక ప్రకటన తెలిపింది. స్థానిక మీడియా ప్రకారం.. 2021 నుంచే షేక్ నవాఫ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఆ సమయంలో ఆయన వైద్య పరీక్షల కోసం అగ్రరాజ్యం అమెరికాకి వెళ్లారు.
అప్పుడు షేక్ నవాఫ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది కానీ, పూర్తిగా కోలుకోలేదు. వైద్య సహాయం పొందుతూ.. కువైట్ ఎమిర్‌గా సమర్థవంతంగా తన పాలనని అందించారు. అయితే.. గత నెలలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకోవాలని దేశ ప్రజలు ప్రార్థనలు చేశారు. కానీ.. అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఈ క్రమంలోనే ఆయన శనివారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. షేక్ నవాఫ్ మృతి చెందిన తర్వాత కువైట్ టెలివిజన్ శనివారం సాధారణ కార్యక్రమాలను నిలిపివేసి.. ఖురాన్ పద్యాలను ప్రసారం చేసింది. రాజ కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు.. ఇలా ఖురాన్‌ని టెలివిజన్‌లలో ప్రసారం చేస్తారు.
ఇంతకీ ఈ షేక్ నవాఫ్ ఎవరు?
షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా (91) మరణానంతరం షేక్ నవాఫ్ కువైట్ ఎమిర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఆయన కువైట్ అంతర్గత, రక్షణ మంత్రిగా పనిచేశారు. 1937లో జన్మించిన షేక్ నవాఫ్.. మాజీ కువైట్ పాలకుడు షేక్ అహ్మద్ అల్-జాబర్ అల్-సబా ఐదో కుమారుడు. 25 ఏళ్ల వయసులోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. 1978 వరకు హవల్లి ప్రావిన్స్‌కు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమిర్‌గా షేక్ నవాఫ్ బాధ్యతలు చేపట్టాక.. దేశీయ సమస్యలపై ఆయన దృష్టి సారించారు. రాజకీయ వివాదాలకు చెక్ పెట్టడంతో పాటు కువైట్ సంక్షేమ వ్యవస్థను పూర్తిగా మార్చేశారు. కువైట్‌లో క్షమాభిక్ష డిక్రీ కూడా ఆయన హయాంలోనే జారీ అయ్యింది.
షేక్ నవాఫ్ వారసుడు ఎవరు?
షేక్ నవాఫ్ మరణానంతరం.. షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబర్ కువైట్ ఎమిర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన వయసు 83 ఏళ్లు. దీంతో.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ రాజుగా షేక్ మెషల్ చరిత్రపుటలకెక్కుతారు. ఆయన దేశ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే.. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Updated Date - Dec 16 , 2023 | 05:10 PM