NASA On UFO: యూఫోలు నిజంగానే ఉన్నాయా, లేవా..? కీలక ప్రకటనలో నాసా ఏం చెప్పిందంటే..?
ABN, First Publish Date - 2023-09-14T22:06:46+05:30
తాము యూఫోలు (UFO - Unidentified Flying Objects) చూశామంటూ విదేశీయులు.. ముఖ్యంగా అమెరికన్లలో చాలామంది చెప్పారు. రాత్రి వేళల్లో మేఘాల మధ్య గుర్తు తెలియని వస్తువులు తమకు కనిపించాయని...
తాము యూఫోలు (UFO - Unidentified Flying Objects) చూశామంటూ విదేశీయులు.. ముఖ్యంగా అమెరికన్లలో చాలామంది చెప్పారు. రాత్రి వేళల్లో మేఘాల మధ్య గుర్తు తెలియని వస్తువులు తమకు కనిపించాయని, అలాంటివి ఎప్పుడూ చూడలేదంటూ ఎన్నో కథనాలు ఉన్నాయి. విడ్డూరం ఏమిటంటే.. ఒక్క అమెరికన్లు తప్ప ఇలాంటి కామెంట్లు ఎవ్వరూ చేయలేదు. ఏదైతేనేం.. ఈ కామెంట్ల దృష్ట్యా ఏలియన్లు, యూఫోలు నిజంగానే ఉన్నాయా? లేవా? అనే అంశంపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు శాస్త్రవేత్తలు.
ఆ సంగతులు పక్కనపెడితే.. అమెరికా అంతరిక్ష సంస్థ లేటెస్ట్‌గా యూఫోలపై కొన్ని కీలక ప్రకటనలను విడుదల చేసింది. గతేడాది నుంచి యూఫోలపై అధ్యయనం చేస్తున్న నాసా.. గురువారం 33 పేజీల నివేదికను విడుదల చేసింది. యూఫోలపై అధ్యయనం చేయాలంటే.. కొత్త శాస్త్రీయ పద్ధతులతో పాటు అధునాతన శాటిలైట్స్ అవసరమని నాసా తెలిపింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రీసెంట్‌గానే మెక్సికన్ కాంగ్రెస్‌లో 1,000 సంవత్సరాల కాలం నాటివని భావించి గ్రహాంతరవాసుల అవశేషాలను బయటపెట్టిన కొన్ని రోజులకే ఈ నివేదిక వచ్చింది.
ఈ నివేదికలోని కీలక అంశాలు ఏమిటంటే..
* ప్రస్తుతం గుర్తించబడిన యూఫోలు భూలోకేతర మూలాలను కలిగి ఉన్నాయని నిర్ధారించడానికి ఎలాంటి కారణం లేదని నాసా పేర్కొంది. అయితే.. యూఫోలు భూమండలంలోని గొప్ప రహస్యాల్లో ఒకటిగా కొత్త నివేదిక తెలిపింది.
* నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ.. కేవలం భూమి మీదే జీవం లేదని, విశ్వంలో ఇతర జీవులు (గ్రహాంతర వాసులు) కూడా ఉన్నాయని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. భూమ్మీదే జీవం ఉందని అనుకోవడం మూర్ఖత్వం అన్నారు.
* గ్రహాల ఉపరితలాలపై, భూమికి సమీపంలో ఉన్న అంతరిక్షంలో ఏలియన్స్ ఉన్నాయా? లేవా? అని శోధించేందుకు.. ప్రస్తుతం ఉన్న నాసా మిషన్లు తమ పరిధిని మరింత విస్తృతం చేయగలవని నివేదిక పేర్కొంది.
* యూఫోల గురించి సమాచారం సేకరించే ప్రయత్నాలను పెంచాలని నాసాను నిపుణుల ప్యానెల్ కోరిన నేపథ్యంలో.. యూఫోలపై పరిశోధనలకు గాను కొత్త డైరెక్టర్‌ను నియమించబోతున్నట్టు నాసా తెలిపింది.
* ఎన్నో విజువల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. యూఫోల గురించి శాస్త్రీయ, ఖచ్ఛితమైన నిర్ధారణలను రూపొందించేందుకు అవసరమైన డేటా తమ వద్ద లేదని నివేదిక వెల్లడించింది.
* అయితే.. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వద్ద ఉన్న అత్యాధునిక పరికరాలు.. నిర్దిష్టమైన యూఫోల కదలికలతో కూడిన నిర్దిష్ట పర్యావరణ కారకాలు ఉన్నాయో లేవో గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పింది.
ఇదిలావుండగా.. యూఫోలపై అధ్యయనం చేసేందుకు నాసా 2022లో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 16 మంది సభ్యులున్న ఈ బృందం.. గతేడాది నుంచి యూఫోలపై అధ్యయనం చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఏడాది తర్వాత.. యూఫోలు ఉన్నాయనడానికి సరైన ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. అయితే.. భూగ్రహంలో జీవం ఉన్నట్టే, విశ్వంలోనూ ఇతర జీవులు ఉండొచ్చని తేల్చి చెప్పింది. అత్యాధునిక పరికరాలతో.. తమ అధ్యయనాన్ని కొనసాగించనున్నట్టు తెలిపింది.
Updated Date - 2023-09-14T22:06:46+05:30 IST