Nawaz Sharif: కార్గిల్ దాడి ప్రణాళికల్ని బయటపెట్టిన నవాజ్ షరీఫ్.. వెలుగులోకి మరిన్ని షాకింగ్ నిజాలు
ABN, First Publish Date - 2023-12-09T18:56:05+05:30
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని ముందుకు దూసుకెళ్తున్న ఆయన.. తన పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతూ కార్గిల్ యుద్ధం గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
Nawaz Sharif On Kargil War: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని ముందుకు దూసుకెళ్తున్న ఆయన.. తన పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతూ కార్గిల్ యుద్ధం గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు. 1999లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధానికి సంబంధించిన పూర్తి ప్రణాళికను బయటపెట్టారు. కార్గిల్ దాడికి తాను అనుకూలంగా లేనని.. పాకిస్థాన్ సైన్యం భారత్‌పై దాడి చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఈ కార్గిల్ ప్లాన్‌ని తాను వ్యతిరేకించానని, దాంతో తాను పదవీచ్యుతుడిని అయ్యానని గుర్తు చేసుకున్నారు. కార్గిల్ దుర్ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు.. 1999లో జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ తనని ప్రభుత్వం నుంచి తొలగించారని ఆయన కుండబద్దలు కొట్టారు.
భారత్‌తో పాటు ఇతర పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటమే తన ఉద్దేశమని నవాజ్ నొక్కి చెప్పారు. అయితే.. పర్వేజ్ మాత్రం కార్గిల్‌పై ఎలాగైనా దాడి చేయాలనే కంకణం కట్టుకున్నాడని, అతని ప్లాన్‌ను తాను వ్యతిరేకించానని అన్నారు. తాను కార్గిల్ ప్లాన్‌కి విరుద్ధంగా గళం విప్పానని, అలా జరగకూడదని చెప్పానని, దాంతో పర్వేజ్ తనని పదవి నుంచి దింపేశారని అన్నారు. ఆ తర్వాత తాను చెప్పిందే నిజమని తేలిందని చెప్పారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో ఇద్దరు భారత ప్రధానులు పాకిస్థాన్‌లో పర్యటించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ, మాజీ ప్రధాని వాజ్‌పేయి లాహోర్‌కు వచ్చారన్నారు. ఆర్థిక వృద్ధిలో పాకిస్థాన్ పొరుగు దేశాల కంటే వెనుకబడి ఉందని విచారం వ్యక్తం చేసిన ఆయన.. భారత్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్‌లతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని నొక్కి చెప్పారు.
ఇదే సమయంలో నవాజ్ షరీఫ్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కూడా విరుచుకుపడ్డారు. అనుభవం లేని వ్యక్తికి అధికార పగ్గాలు ఎందుకిచ్చారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంతో పాక్ ఆర్థిక వ్యవస్థ పతానానికి గురైందని విమర్శించారు. ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం గద్దెనెక్కి.. దేశాన్ని డిఫాల్ట్ నుంచి రక్షించిందని పేర్కొన్నారు. 2017లో తన ప్రభుత్వాన్ని దింపేసి.. దేశాన్ని నాశనం చేసినందుకు గాను మాజీ సైనిక జనరల్స్, న్యాయమూర్తులు జవాబుదారీ వహించాలని డిమాండ్ చేశారు. విలాసవంతమైన కార్లలో తిరిగేందుకు తాను అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని, ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని నవాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-12-09T18:56:07+05:30 IST