Pakistan New Crisis: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందం.. పాక్ పని ఇక అంతే!
ABN, First Publish Date - 2023-03-03T19:01:42+05:30
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్(Pakistan) నెత్తిన మరో పిడుగు పడనుంది.
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్(Pakistan) నెత్తిన మరో పిడుగు పడనుంది. ఇరాన్‌తో కుదుర్చుకున్న గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ (Pakistan Iran gas pipeline project) సకాలంలో పూర్తయ్యే అవకాశం కనపడటం లేదు. దీంతో ఒప్పందం ఉల్లంఘించినట్లై ఇరాన్‌కు 18 బిలియన్ డాలర్ల ($18 billion penalty) మేరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పాక్ పబ్లిక్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ ఆ దేశ నేషనల్ అసెంబ్లీకి తెలియజేసింది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా(US) ఆంక్షల నేపథ్యంలో గ్యాస్‌ప్రాజెక్ట్‌పై ముందుకెళ్తే శ్వేతసౌధం కన్నెర్ర చేసే అవకాశం ఉండటంతో పాక్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. దీంతో ప్రాజెక్ట్‌పై ముందుకెళ్లకుండా ఉండాలంటే ఇరాన్‌కు చెల్లించాల్సిన జరిమానాను అమెరికా ద్వారా సర్దుబాటు చేయించాలని పాక్ యోచిస్తోంది. అయితే ఇదేమంత సులభంగా నెరవేరకపోవచ్చని సమాచారం.
మరోవైపు పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. సైన్యానికి కూడా ఆహారం అందని పరిస్థితి నెలకొంది. దీంతో పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆహ్వార నిల్వలు కరిగిపోతున్నాయంటూ అనేక మంది ఫీల్డ్ కమాండర్లు క్వార్టర్ మాస్టర్ జనరల్‌కి లేఖలు రాశారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. సైన్యాధికారులతో ఆయన దీనిపై లోతుగా చర్చిస్తున్నారు. సరిహద్దుల్లో కాపలాకాస్తున్న సైనికులకు ఆహార పదార్థాల సరఫరాకు కొంత మేర గండిపడనుంది. తెహ్రీక్ ఎ తాలిబన్, బలోచిస్తాన్ రెబల్స్‌తో పోరాడుతున్న పాక్ సైనికులకు తాజా నిర్ణయం శాపంగా మారనుంది.
ప్రజల ప్రధాన ఆహారం అయిన గోధుమ పిండి అత్యధికులకు అందుబాటులో లేకుండా పోయింది. కొన్ని దుకాణాల్లో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ తీవ్రమవుతుండటంతో దాని ప్రభావం వైద్య, ఆరోగ్య రంగాలపై అధికంగా కనిపిస్తోంది. ఆస్పత్రుల్లో అత్యవసర ఔషధాలతో పాటు, ఇన్సులిన్, డిస్పిరిన్ వంటి కనీస మందులు కూడా లేకపోవడంతో రోగులు నరకయాతన పడుతున్నారు. మందుల తయారీకి అవసరమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రేడియంట్స్ పదార్థాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు కనీస విదేశీ మారక ద్రవ్యం నిల్వలు లేవు. దీంతో స్థానిక ఫార్మసీ కంపెనీలు ఉత్పత్తిని బాగా తగ్గించేశాయి. మందులు లేక వైద్యులు ఆపరేషన్లను నిలిపివేశారు. బలూచిస్థాన్‌లోని ఏకైక క్యాన్సర్ ఆస్పత్రి అయిన సెనార్ ఆస్పత్రికి రెండు నెలలుగా మందులు సరఫరా కావడం లేదు. అక్కడి ఉన్న దాదాపు రెండు వేల మంది వ్యాధిగ్రస్థులు గత్యంతరం లేక ఇళ్లకు తిరిగివెళ్లిపోయారు. మందుల కొరత మరొక సమస్యకు దారి తీసింది. పని లేదన్న కారణంతో చాలా ఆస్పత్రుల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ సమస్య విపత్తుగా మారకముందే జోక్యం చేసుకోవాలని ఇటీవల పాకిస్థాన్ మెడికల్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.
ఆహార కొరత, విద్యుత్ సంక్షోభానికి తోడు ప్రజలకు పాక్ ప్రభుత్వం పెట్రో షాక్ కూడా ఇచ్చింది. తాజాగా పెట్రో ధరలు అనూహ్యంగా పెంచేసింది. పెట్రోల్, డీజిల్ లీటర్‌కు ఒక్కసారిగా 35 రూపాయలు పెంచేసింది. అదే సమయంలో కిరోసిన్, లైట్ డీజిల్ ఆయిల్ లీటర్‌కు 18 రూపాయలు పెంచింది.
నగదు కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కరెన్సీ విలువ భారీగా క్షీణిస్తోంది. డాలర్ మారకంలో దేశ కరెన్సీ విలువ ఇంతకు ముందెన్నడూ లేని కనిష్ఠ స్థాయికిదిగజారింది. నూతన మారకపు రేటు వ్యవస్థను ప్రారంభించిన 1999 నుంచి ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో రూపాయి విలువ క్షీణించలేదు. ఐఎంఎఫ్ నుంచి నిధులను పొందడానికి విధించిన షరతుల మేరకు డాలర్-రూపాయి మారకపు రేటుపై ప్రభుత్వం పరిమితులను తొలగించడం పాక్ రూపాయి విలువ క్షీణతకు దారితీస్తోంది.
పాక్‌లో నెలకొన్న తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాలకు.. విద్యుత్ సంక్షోభం కూడా తోడైంది. ఇప్పటికే తినడానికి తిండి కూడా దొరకక, గోధుమపిండి కోసం తొక్కిసలాటల్లో మరణాలు సంభవిస్తున్న దీనస్థితిలోకి చేరిన పాక్.. తాజాగా విద్యుత్ సంక్షోభంలోకి కూడా జారిపోయింది. దక్షిణ పాకిస్థాన్‌లోని నేషనల్ గ్రిడ్‌లో వైఫల్యం తలెత్తడంతో దేశంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని జంషోరో, దాదుల మధ్య విద్యుత్ సరఫరా ఫ్రీక్వెన్సీలో మార్పులు, వోల్టేజీలో హెచ్చుతగ్గులు రావడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, పెషావర్ తదితర అన్ని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కరెంటు రాకపోవడంతో విద్యుత్ ఆధారిత పరిశ్రమలు మూతపడ్డాయి. వ్యవస్థలన్నీ స్తంభించాయి.
Updated Date - 2023-03-03T19:04:03+05:30 IST