Turkey Earthquake: భూకంప బాధితులకు ఎవరూ ఊహించని ఆఫర్ ఇచ్చిన టర్కిష్ ఎయిర్‌లైన్స్!
ABN, First Publish Date - 2023-02-12T19:41:38+05:30
టర్కీలోని భూకంప ప్రభావిత ప్రజలకు ఆ దేశ టర్కిష్ ఎయిర్‌లైన్
అంకారా: టర్కీలోని భూకంప ప్రభావిత ప్రజలకు ఆ దేశ టర్కిష్ ఎయిర్‌లైన్స్(Turkish Airlines), పెగాసస్ ఎయిర్‌లైన్స్(Pegasus Airlines) ఆదుకునేందుకు ముందుకొచ్చాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలైన ఇస్తాంబుల్(Istanbul), అంకారా(Ankara), అంటాల్యా(Antalya) సహా ఇతర ప్రాంతాలకు ప్రజలను ఉచితంగా చేరవేస్తామని ప్రకటించాయి. భూకంపంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు కళాశాలలు, యూనివర్సిటీ హాస్టళ్లు, టూరిస్టు ప్రాంతాల్లోని కొన్ని హోటళ్లు ఆశ్రయం కల్పిస్తున్నాయి. గజియాంటెప్, హతాయ్, నుర్దగి, మరాష్ నుంచి వేలాదిమంది తరలివెళ్లిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వేలాదిమంది రావడంతో గజియాంటెప్(Gaziantep) విమానాశ్రయం కిక్కిరిసిపోయింది.
ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా ఏడో రోజూ కూడా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనన్న అనుమానంతో రెస్క్యూ బృందాలు అణువణువు గాలిస్తున్నాయి. టర్కీ(Turkey), సిరియా(Syria)ల్లో గతవారం సంభవించిన భారీ భూకంపంలో 28 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత శతాబ్దకాలంలోనే సంభవించిన అతిపెద్ద విపత్తుగా దీనిని చెబుతున్నారు.
మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భూకంపం కారణంగా నిరాశ్రయులైన లక్షలాదిమంది ప్రజలు ఆకలి, వణికించే చలి మధ్య కాలం గడుపుతున్నారు. చలి కారణంగా మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రెస్క్యూ బృందాలు శనివారం రాత్రి గుర్తించి వెలికి తీశాయి. మలట్యాలోని ఓ హోటల్ శిథిలాల కింద చిక్కుకుని మరణించిన భారతీయుడిని శనివారం గుర్తించారు. అతడిని ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ జిల్లా కోట్‌ద్వార్ ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్‌గా గుర్తించారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో పనిచేస్తున్న ఆయన బిజినెస్ ట్రిప్‌లో భాగంగా టర్కీ వెళ్లాడు. గతవారం సంభవించిన భూకంపంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
Updated Date - 2023-02-12T20:29:09+05:30 IST