India and China : భారత్-చైనా మధ్య అరుదైన సైనిక చర్చలు
ABN, First Publish Date - 2023-08-16T10:58:53+05:30
భారత దేశం, చైనా మధ్య రెండు రోజులపాటు సైనిక చర్చలు జరిగాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి మిగిలిన సమస్యలను ఇక ఆలస్యం లేకుండా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
న్యూఢిల్లీ : భారత దేశం, చైనా మధ్య రెండు రోజులపాటు సైనిక చర్చలు జరిగాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి మిగిలిన సమస్యలను ఇక ఆలస్యం లేకుండా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ చర్చలు సకారాత్మకం (Positive)గా జరిగాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
చూసుల్-మోల్డో సరిహద్దు సమావేశ ప్రదేశంలో జరిగిన 19వ విడత కార్ప్స్ కమాండర్ లెవెల్ సమావేశం సకారాత్మకంగా, నిర్మాణాత్మకంగా, లోతుగా జరిగినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ అరుదైన చర్చల్లో తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి మిగిలిన సమస్యలను ఇక ఆలస్యం లేకుండా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలిపింది. అయితే మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించడంపై తక్షణ ఉపశమనం మాత్రం కనిపించలేదు. బీజింగ్, న్యూఢిల్లీలలో ఏక కాలంలో విడుదలైన ప్రకటనలు ఈ వివరాలను తెలిపాయి.
వెస్టర్న్ సెక్టర్‌లో ఎల్ఏసీ వెంబడి మిగిలిన సమస్యలను పరిష్కరించుకోవడంపై లోతుగా చర్చ జరిగిందని తెలిపాయి. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా, సకారాత్మకంగా జరిగినట్లు వివరించాయి. దేశాధినేతల మార్గదర్శనంలో, అరమరికలు లేకుండా, దూరదృష్టితో ఈ చర్చలు జరిగాయని తెలిపాయి. మిగిలిన సమస్యలను వేగవంతంగా సైనిక, దౌత్య మార్గాల్లో చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యాలను కొనసాగించడానికి ఇరు పక్షాలు అంగీకరించినట్లు చెప్పాయి.
జీ20 సమావేశాలు సెప్టెంబరు 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగుతాయి. ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఈ అంగీకారం కుదరడం విశేషం.
2020 మే నుంచి ప్రతిష్టంభన
తూర్పు లడఖ్‌లో చైనా దూకుడు వల్ల ఇరు దేశాల మధ్య 2020 మే నుంచి ప్రతిష్టంభన ఏర్పడింది. అదే ఏడాది జూన్‌లో గాల్వన్ లోయలో జరిగిన ఇరు దేశాల సైనికుల ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా సైనికులు ఎందరు మరణించారో ఆ దేశం స్పష్టంగా చెప్పలేదు. అయితే కార్ప్స్ కమాండర్ లెవెల్ చర్చలు 2020లో ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు సత్ఫలితాలివ్వడంతో గాల్వన్, పాంగాంగ్ సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలు; గస్తీ ప్రదేశాలు 15, 17ఏ (PP 15, 17A), గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్ ఏరియాల నుంచి సైన్యాల ఉపసంహరణ జరిగింది. అయితే డెప్సాంగ్ మైదానం, దెమ్‌చోక్‌ల నుంచి సైన్యాల ఉపసంహరణపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ సమస్యలు 2020నాటి ప్రతిష్టంభన కన్నా ముందే ఉన్నాయని చైనా వాదించడంతో ఇక్కడి సమస్యలు పరిష్కారం కావడం లేదు.
ఈ ప్రతిష్టంభనకు పరిష్కారం లభించే వరకు ఇరు దేశాల మధ్య సాధారణ స్థితి నెలకొనే అవకాశం లేదని భారత ప్రభుత్వం కరాఖండీగా చెప్తోంది.
ఇవి కూడా చదవండి :
Birthday wishes : కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ
Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పాయి నాయకత్వంతో దేశానికి గొప్ప మేలు : మోదీ
Updated Date - 2023-08-16T10:58:53+05:30 IST