Morbi Bridge collapse: ప్రమాదానికి ముందే తుప్పుపట్టి తెగిపోయి 22 తీగలు, సిట్ నివేదికలో సంచలన విషయాలు
ABN, First Publish Date - 2023-02-20T14:48:56+05:30
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్‌లోని మోర్బీ వంతెన కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక విచారణ బృందం (SIT) తమ ప్రాథమిక దర్యాప్తులో..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్‌లోని మోర్బీ వంతెన (Morbi Bridge) కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక విచారణ బృందం (SIT) తమ ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు బయటపెట్టింది. ప్రమాదం జరడానికి ముందే వంతెనలోని సగానికి సగం తీగలు (22 wires) తుప్పుపట్టాయని, రిపేర్ పేరుతో పాత ఇనుమ కడ్డీలను కొత్త వాటితో వెల్డింగ్ చేయడం బ్రిడ్జి కూలిపోవడానికి దారితీసిన ప్రధాన లోపాలని తెలిపింది.
మచ్చు నదిపై (Machchu river) నిర్మించిన బ్రిటిష్ కాలం నాటి ఈ వంతెన గత ఏడాది అక్టోబర్‌లో, అదికూడా మరమ్మతు పనులు పూర్తి చేసి తిరిగి ప్రారంభించిన అనంతరం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు బాధ్యతను సిట్‌కు గుజరాత్ ప్రభుత్వం అప్పగించింది. దీనిపై 2022 డిసెంబర్‌లో ప్రాథమిక దర్యాప్తు నివేదికను సిట్ సమర్పించింది. ఈ నివేదికను రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల మోర్బీ మున్సిపాలిటీతో పంచుకుంది. ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ బనివాల్, ఐపీఎస్ అధికారి సుభాష్ త్రివేది, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు చెందిన కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఒకరు 'సిట్'లో సభ్యులుగా ఉన్నారు.
వంతెన పునర్నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఒరేవా గ్రూప్ దక్కించుకోగా, మరమ్మతులు, నిర్వహణంలో తీవ్రమైన లోపాలు చోటుచేసుకున్నట్టు సిట్ తమ నివేదికలో పేర్కొంది. వంతెన ప్రధాన కేబుల్‌లో ఒక కేబుల్ పూర్తిగా తుప్పుపట్టిపోయిందని, దాని వైర్లలో సగానికి సగం అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం వంతెన కుప్పకూలడానికి ముందే తెగిపోయి ఉండవచ్చని తెలిపింది. ప్రతి కేబుల్ 7 స్ట్రాండ్స్‌తో, ఒక్కొక్కటి ఏడు స్టీల్ వైర్లతో, మొత్తం 49 వైర్ల ను ఏడు కడ్డీలతో కలిపారని, వాటిలో 22 వైర్లు తప్పుపట్టినట్టు గమనించామని తెలిపింది. తక్కిన 27 వైర్లు ఇటీవల తెగిపోయినట్టు గుర్తించామని నివేదిక పేర్కొంది.
మోర్బీ బ్రిడ్జి మరమత్తు కాంట్రాక్టును మార్చి 2022లో ఒరేవా గ్రూప్‌కు స్థానిక మున్సిపాలిటీ అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉండగానే వంతెన కుప్పకూలిన ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర సంచలనమైంది. ఒరేవాతో అప్పట్లో ఎంఓయూపై సంతకం చేసిన మోర్బీ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్‌సిన్హ్ జలాను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, తమ అనుమతి లేకుండానే ఒరేవా గ్రూప్ వంతనెనను రీఓపెన్ చేసిందని మోర్బీ మున్సిపాలిటీ చెబుతోంది.
Updated Date - 2023-02-20T14:58:01+05:30 IST