DRDO : సెక్స్ కోసం పాకిస్థానీ గూఢచారికి రహస్య సమాచారం ఇచ్చేసిన డీఆర్డీఓ అధికారి
ABN, First Publish Date - 2023-02-25T11:23:52+05:30
రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) సీనియర్ అధికారి ఒకరు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. లైంగిక సుఖం కోసం చాలా
బాలాసోర్ (ఒడిశా) : రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) సీనియర్ అధికారి ఒకరు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. లైంగిక సుఖం కోసం చాలా విలువైన సమాచారాన్ని పాకిస్థానీ గూఢచారికి అందించారు. దీనిని పసిగట్టిన ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో ఆయనను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
ఒడిశాలోని ఈస్టర్న్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హిమాంశు కుమార్ లాల్ మీడియాతో మాట్లాడుతూ, ఒడిశా (Odisha)లోని బాలాసోర్ జిల్లా, చాందీపూర్‌లో ఉన్న డీఆర్‌డీవో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (Integrated Test Range-ITR)లో పని చేస్తున్న 57 ఏళ్ళ వయసుగల ఓ ఉన్నతాధికారి మన దేశ రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఓ పాకిస్థానీ గూఢచారికి అందించారని తెలిపారు. క్షిపణి పరీక్షలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పంపించారన్నారు. పాకిస్థానీ గూఢచారికి చేరిన సమాచారం వివరాలు దర్యాప్తులో స్పష్టమవుతాయన్నారు. చాందీపూర్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఫిర్యాదు మేరకు ఆ డీఆర్‌డీవో ఉన్నతాధికారిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టయిన అధికారిపై ఐపీసీ సెక్షన్లు 120ఏ, 120బీ, అధికార రహస్యాల చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆ డీఆర్‌డీవో అధికారి సెక్స్, ఆర్థిక ప్రయోజనాల కోసం రక్షణ వ్యవస్థకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని పాకిస్థానీ గూఢచారి (Pakistani Spy)కి అందించినట్లు ఫిర్యాదులో ఆరోపించారని తెలిపారు. ఆయన ఫోన్‌ను తనిఖీ చేసినపుడు వాట్సాప్ చాట్స్‌లో లైంగికంగా ప్రేరేపించే ఫొటోలు, వీడియోలు కనిపించాయని చెప్పారు. ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఐటీఆర్-చాందీపూర్‌లో గూఢచర్యం సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. 2021 సెప్టెంబరులో ఐదుగురు కాంట్రాక్టు సిబ్బందిని ఈ ఆరోపణలపై అరెస్టు చేశారు. 2015లో ఓ కాంట్రాక్టు ఉద్యోగిని గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు.
చాందీపూర్‌లో రెండు డీఆర్‌డీఓ టెస్ట్ రేంజెస్ ఉన్నాయి. ఇవి ఐటీఆర్, పీఎక్స్ఈ (Proof and Experimental Establishment). వీటిలో క్షిపణులు, రాకెట్లు, ఆయుధాల వ్యవస్థల సమర్థతను పరీక్షిస్తూ ఉంటారు.
ఇవి కూడా చదవండి :
Yogi Adityanath : యోగి ఆదిత్యనాథ్ భద్రతా సిబ్బందిలో ఒకరు అనూహ్య మృతి
Updated Date - 2023-02-25T11:23:55+05:30 IST