యూపీలో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ హత్య
ABN, First Publish Date - 2023-06-08T02:35:59+05:30
యూపీలోని లఖ్‌నవూలో దారుణం చోటు చేసుకుంది. విచారణకు హాజరైన గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా(48)ను కోర్టు ఆవరణలోనే దుండగులు కాల్చి చంపారు.
లక్నో, జూన్ 7: యూపీలోని లఖ్‌నవూలో దారుణం చోటు చేసుకుంది. విచారణకు హాజరైన గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా(48)ను కోర్టు ఆవరణలోనే దుండగులు కాల్చి చంపారు. లాయర్ దుస్తుల్లో వచ్చిన వ్యక్తులు అందరూ చూస్తుండగానే సంజీవ్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. అయితే ఆ దుండగుల్లో ఒకరిని న్యాయవాదులు పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. లఖ్‌నవూలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. కాల్పుల్లో ఓ పోలీసుతో పాటు రెండేళ్ల బాలికకు గాయాలవ్వగా వారిని ఆస్పత్రికి తరలించారు. రక్తపు గాయాలతో సంజీవ్ నేలపై పడి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పశ్చిమ యూపీలో క్రిమినల్ గ్యాంగ్ నడిపిన సంజీవ్.. వివాదాస్పద రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీకి అనుచరుడు. ఆనాటి రాష్ట్ర మంత్రి బ్రహ్మదత్ ద్వివేది, బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసుల్లోనూ సంజీవ్ నిందితుడిగా ఉన్నాడు. యూపీతో పాటు ఉత్తరాఖండ్‌లో అతడిపై 50కి పైగా క్రిమినల్ కేసులున్నాయి. పోలీస్ కస్టడీలో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రప్ హత్యకు గురైన 2 నెలల్లోపే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది.
Updated Date - 2023-06-08T02:35:59+05:30 IST