ఎన్డీఏకి అన్నాడీ ఎంకే రాంరాం
ABN, First Publish Date - 2023-09-26T02:08:32+05:30
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్‌డీఏకి గట్టి దెబ్బ తగిలింది. తమిళనాట తమకు నమ్మినబంటుగా భావిస్తున్న అన్నాడీఎంకే..
బీజేపీ కూటమిలో ఇక ఉండలేం.. వచ్చే ఎన్నికల్లో బీజేపీయేతర కూటమితో జట్టు
మాజీ సీఎం పళనిస్వామి నిర్ణయం
అన్నాడీఎంకే కార్యకర్తల సంబురాలు
చెన్నై, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్‌డీఏకి గట్టి దెబ్బ తగిలింది. తమిళనాట తమకు నమ్మినబంటుగా భావిస్తున్న అన్నాడీఎంకే.. ఆ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలతో కూడిన కూటమితో కలిసి పోటీ చేయనున్నట్లు పేర్కొంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత కేపీ మునుస్వామి ప్రకటించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు గత మాసంలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, తమ నేతల్ని అవమానించేలా మాట్లాడ్డం తదితరాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇదిలా వుండగా ఇటీవల పళనిస్వామిని ఢిల్లీ పిలిపించుకున్న కేంద్ర హోమంత్రి అమిత్‌షా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు కనీసం 50ు స్థానాలు (20 సీట్లు) కావాలని చెప్పినట్లు సమాచారం. దీనికి తోడు దివంగత సీఎంలు జయలలిత, అన్నాదురైపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు అన్నాడీఎంకే నేతల్నీ అవినీతిపరులుగా పేర్కొంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విడుదల చేసిన జాబితా దుమారం రేపుతోంది. వీటన్నింటి నేపథ్యంలోనే గత కొంతకాలంగా అన్నాడీఎంకే నేతలు బీజేపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు తమతో పొత్తు కుదరదంటే ‘డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్’(డీవీఏసీ) ఎలాగూ వుందంటూ అన్నామలై చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే నేతలకు మరింత ఆగ్రహం తెప్పించాయి. వీటన్నింటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా తమ అధినేత నిర్ణయం పట్ల అన్నాడీఎంకే శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై తమ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఈ విడాకులు ముందస్తు ఒప్పందమే?!
బీజేపీతో కలిసి సాగితే రాష్ట్రంలో తాము పూర్తిగా నష్టపోవడం ఖాయమని తేలడంతో.. ‘ఎన్నికల వరకూ ఎవరికివారుగా పోటీ చేసి, ఫలితాలు వచ్చాక మద్దతు ఇస్తామన్న’ ఒప్పందం మేరకే ఈ ‘విడాకుల’ ప్రకటన జరిగిందని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అన్నామలై ఒంటెత్తు పోకడలు, ఉదయనిధి సనాతన ధర్మ నిర్మూలనా నినాదం వంటి వాటితో తమిళనాట బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దీంతో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తే తాము కూడా నష్టపోతామని, అందువల్ల ఎన్నికల్లో ఫలితాలు వచ్చాక కేంద్రంలో అవసరమైతే మద్దతు ఇస్తామని పళనిస్వామి అమిత్‌షాకు నచ్చచెప్పారని, ఆయన అనుమతి తీసుకున్నాకే ఇలా కూటమి వీడుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించిందని డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నాయి.
‘అవసరం’ తీరాకే..!
జయలలిత మరణానంతరం తమ ప్రభుత్వాలను కాపాడుకునేందుకు మాజీ సీఎంలు పన్నీర్‌సెల్వం, పళనిస్వామి బీజేపీ శరణుజొచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో కూడిన కూటమి ఘోరపరాజయాన్ని చవిచూసింది. మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గాను ఒకే ఒక సీటును దక్కించుకోగలిగింది. ఆ తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లు సాధించుకోగలిగినా అన్నాడీఎంకే మాత్రం తీవ్రంగా నష్టపోయింది. దీంతో బీజేపీతో కలిసి సాగితే తమ పుట్టి మునగడం ఖాయమని భావిస్తున్న అన్నాడీఎంకే నేతలు.. ఇదే అదనుగా ఆ పార్టీని వదిలించుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Updated Date - 2023-09-26T02:08:37+05:30 IST