Air India : గర్ల ఫ్రెండ్‌ని కాక్‌పిట్‌లో కూర్చోబెట్టిన పైలట్.. ఎయిరిండియాకు భారీ జరిమానా..
ABN, First Publish Date - 2023-05-12T21:07:40+05:30
ఎయిరిండియా విమానంలో భద్రత ప్రమాణాలను పాటించడంలో విఫలమైనందుకు విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్
న్యూఢిల్లీ : ఎయిరిండియా విమానంలో భద్రత ప్రమాణాలను పాటించడంలో విఫలమైనందుకు విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శుక్రవారం కఠిన చర్యలను ప్రకటించింది. ఢిల్లీ-దుబాయ్ విమానం ఏఐ915 కాక్‌పిట్‌లోకి పైలట్ తన స్నేహితురాలిని అనుమతించినందుకు ఎయిరిండియాకు రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఫిబ్రవరి 27న ఈ సంఘటన జరిగింది.
డీజీసీఏ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, భద్రతాపరంగా సున్నితమైన అంశాన్ని సకాలంలో, సమర్థవంతంగా పరిష్కరించడంలో విఫలమైనందుకు ఎయిరిండియాకు రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు తెలిపింది. పైలట్ ఇన్ కమాండ్ (పైలట్) లైసెన్సును మూడు నెలలపాటు సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937 ప్రకారం తనకు లభించిన అధికారాన్ని పైలట్ దుర్వినియోగం చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా డీజీసీఏ రెగ్యులేషన్స్ ఉల్లంఘనకు అవకాశం ఇచ్చినందుకు ఈ చర్యలు తీసున్నట్లు పేర్కొంది. ఈ ఉల్లంఘనను నిరోధించడంలో దృఢంగా వ్యవహరించలేకపోయిన కోపైలట్‌ను కూడా హెచ్చరించింది.
ఈ విమానంలోని ఆపరేటింగ్ సిబ్బందిలో ఒకరు ఎయిరిండియా సీఈఓకు ఫిర్యాదు చేశారని డీజీసీఏ ప్రకటన పేర్కొంది. ఈ ఫిర్యాదుపై ఎయిరిండియా సకాలంలో, సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోలేకపోయిందని, ఇది భద్రతాపరంగా సున్నితమైన ఉల్లంఘన అని తెలిపింది.
డీజీసీఏ రూలింగ్‌ను అంగీకరిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఫిర్యాదుపై చర్య తీసుకోలేదని చెప్పడాన్ని మాత్రం తోసిపుచ్చింది. అనేక ఆరోపణలు ఉంటాయని, వాటిపై సముచితమైన ప్రక్రియ ద్వారా, గోప్యంగా దర్యాప్తు చేయవలసి ఉంటుందని తెలిపింది. ఈ ఉల్లంఘనపై ఫిర్యాదు వచ్చిన వెంటనే దర్యాప్తు ప్రారంభమైందని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Rajasthan: గెహ్లాట్‌కు ఆర్‍ఎస్ఎస్ ఫోబియా...బీజేపీ చీఫ్ ఫైర్..!
Karnataka election : ‘కింగ్‌మేకర్’ జేడీఎస్ సిద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌లకు సైగలు..
Updated Date - 2023-05-12T21:07:40+05:30 IST