అఖండ భారత్ పునఃసృష్టి సాధ్యమేనా? వైరల్ అవుతున్న పెయిటింగ్..!
ABN, First Publish Date - 2023-05-29T18:36:22+05:30
నభూతో నభవిష్యతి అనే రీతిలో భారత దేశ నూతన పార్లమెంటు అద్భుత కట్టడంగా ఆవిష్కృతమైంది. సెంట్రల్ విస్టాలో భాగంగా రెండేన్నరేళ్లలోపు కొత్త భవన నిర్మాణం పూర్తయింది. అయితే, ఇదే సమయంలో పార్లమెంటు కొత్త భవనంలోని గోడపై ఏర్పాటు చేసిన 'అఖండ భారత్' మురల్ పెయిటింగ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ: అడుగడుగునా అద్భుతం, విశాలమైన సీటింగ్, జ్ఞాన-శక్తి-కర్మ అనే మూడు ద్వారాలు, అత్యాధునిక హంగులు, త్రిమూర్తులను గుర్తుచేసే త్రిభుజాకృతిలో భవనం, ప్రీమియం కార్పెట్లు, రాజ్యాంగ మందిరం, ఆర్ట్ గ్యాలరీ, రాజదండం...ఇలా నభూతో నభవిష్యతి అనే రీతిలో భారత దేశ నూతన పార్లమెంటు (New Parliament) అద్భుత కట్టడంగా చెప్పుకోవచ్చు. సెంట్రల్ విస్టాలో భాగంగా రెండేన్నరేళ్లలోపు కొత్త భవన నిర్మాణం పూర్తయింది. అయితే, ఇదే సమయంలో పార్లమెంటు కొత్త భవనంలోని గోడపై ఏర్పాటు చేసిన 'అఖండ భారత్' (Akhanda Bharath) మురల్ పెయిటింగ్ (Mural Painting) అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖండ భారత్ సాధించాలనే ఆర్ఎస్ఎస్ సంకల్పానికి ఇది అద్దంపడుతుందని కొందరు సమర్ధిస్తుండగా, అఖండ్ భారత్ పునఃసృష్టి అసాధ్యమని మరికొందరు పెదవి విరుస్తున్నారు. చైనా, పాకిస్థాన్ వంటి పొరుగుదేశాలతో సరిహద్దు చిక్కులు ఎదుర్కొంటున్న భారత్ ఆచరణకు సాధ్యం కాని 'అఖండ్ భారత్' నినాదం అందుకోవడం వింతగా ఉందని, ఇది లేనిపోని ఆడంబరాన్ని చాటుకోవడమే అవుతుందని అంటున్నారు.
సంకల్పం సుస్పష్టం...అఖండ్ భారత్
'సంకల్పం సుస్పష్టం..అఖండ్ భారత్' అంటూ అఖండ్ భారత్ మురల్‌పై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ట్వీట్ చేయడం ఈ చర్చకు దారితీసింది. దీనిపై నేషనల్ గ్యాలరీ
ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ డెర్కటర్ జనరల్ అద్వైత్ గాడన్‌నాయక్ వివరణ ఇస్తూ, ప్రాచీనకాలంలో భారతీయ చింతన ప్రభావాన్ని చెప్పడమే తమ ఉద్దేశమని, ఇది ప్రస్తుత ఆప్ఘనిస్థాన్ నుంచి ఆగ్నేయాసియా వరకూ విస్తరించిందని అన్నారు.
జాతీయవాదులు వర్సెస్ లౌకికవాదులు
హిందువులను ఉత్తేజపరిచే అంశాల్లో 'అఖండ్ భారత్' అంశం ఒకటి. పురాతన భారతదేశం-అఖండ భారత్ అనే లక్ష్యాలను ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు తరచు ప్రస్తావిస్తుంటారు. అఖండ భారత్ లెక్కల ప్రకారం చూస్తే, ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్, నేపాల్, బర్మా, టిబెట్, భూటాన్ బంగ్లాదేశ్‌లను కలిపే ప్రాజెక్టు. ఒకప్పుడు ఇవన్నీ కలిసే ఉండేవని, తిరిగి అన్నింటినీ ఏకం చేసి అఖండ్ భారత్ సృష్టి జరగాలనేది అఖండ్ భారత్ అనుకూలవాదుల వాదన. పాకిస్థాన్, భారత్‌లను ఏకం చేస్తే ఆఖండ్ భారత్ సాకరం అవుతుందంటూ 1965లో జనసంఘ్ ఓ తీర్మానం కూడా చేసింది. ప్రధాని మోదీ సైతం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకమునుపు అఖండ్ భారత్‌పై బీజేపీ ఆలోచనను వివరించారు. ప్రజల సమ్మతితోనే ఇది జరుగుతుందని, దీనిని సాంస్కృతిక్ భారత్‌గా చెప్పుకోవచ్చని అన్నారు. అయితే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాదన క్రమంగా బలహీనపడినట్టు కనిపిస్తుంది.
భారత్, పాక్, ఆప్ఘనిస్థాన్ కలిస్తే అప్పుడు ముస్లింల మెజారిటీ పెరిగి, హిందువులు మైనారిటీలోకి జారుతారని... ఇదే జరిగితే... హిందుస్థాన్ ఇస్లామిక్ దేశంగా మారడం చాలా సులభమనే కోణం కూడా తలెత్తింది. ఆ దేశాల్లోని ముస్లింలను హిందుత్వ వైపు నడిపించి... ఆ అఖండ భారత్‌ను ఒక హిందూ దేశంగా మార్చుతారా అనే ప్రశ్నల్ని ఆరెస్సెస్, బీజేపీ ముందుంచుతున్నారు. అయితే, హిందూ రాష్ట్రాన్ని ప్రకటించడమంటే పాకిస్థాన్ మాదిరిగానే మతతత్వ రాజ్యంగా మార్చడమేననని, ఇది జాతీయ ఐక్యతను బలహీన పరుస్తుందని లౌకకవాదుల వాదన. హిందూ రాష్ట్రం వాదన భారతదేశాన్ని విశ్వగురువుగా, ప్రపంచ నాయకుడిగా స్థాపించాలనే కలను శాశ్వతంగా భూస్థాపితం చేస్తుందని వారి బలంగా వాదిస్తున్నారు.
ఔచిత్యం లేదు..!
'అఖండ భారత్' మురల్ పెయింటింగ్ విషయంలో సోషల్ మీడియాలో చర్చ జరుపుతున్న వారు సైతం, ఇదెలా సాధ్యమనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓవైపు పాకిస్థాన్‌తో వైరం కొనసాగుతుండగా, చైనా సరిహద్దు వివాదం ఎడతెగని విధంగా ఉందని వీరి వాదన. చైనా ఇప్పటికే భారత్‌తో ఉన్న తన సరిహద్దులకు సమీపంలో దాదాపు 60 శాశ్వత గ్రామాలు, అత్యాధునిక మౌలిక వసతుల కల్పనతో దూసుకుపోతోంది. భారత్‌కు ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతూనే ఉంది. ఈ క్రమంలో 'అఖండ్ భారత్' నినాదంలో ఔచిత్యం లేదని, అసాధ్యాలను సుసాధ్యాలను చేస్తామని ప్రచారం చేసుకోవడమే దీని వెనుక ఉద్దేశంగా కనిపిస్తోందని వారంటున్నారు. మొత్తంమీద... 'అఖండ్ భారత్' మురల్ పెయిటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసి భిన్న ఆలోచనలను మరోసారి తెరపైకి తెచ్చింది.
Updated Date - 2023-05-29T18:41:52+05:30 IST