Basavaraj Bommai: హంగ్ ప్రసక్తే లేదు, సీఎం ఎవరంటే..?
ABN, First Publish Date - 2023-05-12T15:50:20+05:30
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనాతా పార్టీ విజయానికి ఢోకా లేదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది శాసనసభాపక్షం నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యాన్ని ఆయన కొట్టివేశారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనాతా పార్టీ విజయానికి ఢోకా లేదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) అన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది శాసనసభాపక్షం నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యాన్ని ఆయన కొట్టివేశారు.
''హంగ్ అసెంబ్లీకి అవకాశమే లేదు. మేము సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రేపటి వరకూ (ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) 141 సీట్లు గెలుచుకుంటామనే ఆనందంలో ఆయనను (డీకే శివకుమార్) ఉండనీయండి. బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో సీఎం ఎవరనేది నిర్ణయిస్తారు'' అని బొమ్మై శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఆపరేషన్ లోటస్...
బీజేపీ ఎప్పుడూ ఆపరేషన్ లోటస్‌కు పాల్పడలేదని, అపవిత్ర కూటమికి పాల్పడింది కాంగ్రెస్సేనని మరో ప్రశ్నకు సమాధానంగా బొమ్మై చెప్పారు. ఎవరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేదీ తాము నిర్ణయిస్తామని జేడీఎస్ చెబుతుండటంపై అడిగినప్పుడు, గతంలోనూ తాను కింగ్‌మేకర్ కాదని, కింగ్ అని కుమారస్వామి చెప్పారని, ఎవరి అంచనాలు వారికి ఉంటాయని అన్నారు.
నిర్ణయం జరిగిపోయింది: జేడీఎస్
కాగా, కర్ణాటకలో ఎవరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దానిపై తమ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందని జేడీఎస్ నేత తన్వీర్ అహ్మద్ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. అయితే, తమ కూటమి భాగస్వామి ఎవరో వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. తగిన సమయం వచ్చినపుడు తామే బహిరంగంగా చెబుతామన్నారు. కర్ణాటక, కన్నడికులకు స్థితిగతులను మెరుగుపరచే నిర్దిష్ట ప్రోగ్రాంలు అమలు చేయాలని, వాటిని ఎవరైతే సమర్ధవంతంగా అమలు చేయగలరో తమకు తెలుసునని, వారితోనే తాము జత కడతామని చెప్పారు.
Updated Date - 2023-05-12T15:50:20+05:30 IST