Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో మెజారిటీ మార్కు దాటిన బీజేపీ... 123 స్థానాల్లో లీడ్
ABN, First Publish Date - 2023-12-03T10:10:00+05:30
మధ్యప్రదేశ్ ఓట్ల కౌంటింగ్‌లో అధికార బీజేపీ తన దూకుడు కొనసాగిస్తోంది. ఎన్నికల్లో విజయానికి 116 సీట్లు అవసరమైతే బీజేపీ ప్రస్తుతం 123 సీట్లలో ముందంజలో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్ ఓట్ల కౌంటింగ్‌లో అధికార బీజేపీ దూకుడు కొనసాగిస్తోంది. ఎన్నికల్లో విజయానికి 116 సీట్లు అవసరంకాగా బీజేపీ ప్రస్తుతం123 సీట్లలో ముందంజలో ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే అదనంగా 18 స్థానాల్లో బీజేపీ లీడ్‌లో ఉంది. గతంతో పోలిస్తే మరో 13 స్థానాల్లో కాంగ్రెస్ వెనక బడింది. ఎన్నికల్లో బరిలో నిలిచిన హేమాహేమీల్లో ఒకరైన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తొలి రౌండ్ నుంచీ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న సీనియర్ నేత కమల్ నాథ్ తన నియోజకవర్గంలో ఆధిపత్యంలో ఉన్నారు. చౌహాన్.. బుధ్నీ నియోజకవర్గం నుంచి, కమల్ నాథ్.. ఛింద్వారా నుంచి పోటీకి దిగారు.
బీజేపీకి మధ్యప్రదేశ్ కంచుకోట. రాష్ట్రంలో జరిగిన గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిని కాషాయం పార్టీనే తన ఖాతాలో వేసుకుంది. దిగ్విజయ్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ చివరి సారిగా 1993, 98 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. 2003 నుంచి రాష్ట్రంలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఈసారి కచ్చితంగా ట్రెండ్‌ను తలకిందులు చేస్తామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, విజయం తమదేనని సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ట్రెండ్‌ను కొనసాగిస్తూ మరోమారు తాము అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టిపోటీ ఉంటుందని అంటున్నారు కానీ అలాంటిదేమీ కనిపించట్లేదు. పార్టీ వర్కర్లు, మహిళలు కలిసి బీజేపీ గెలుపుదారిలో ముళ్లన్నీ తొలగించి మార్గం సుగమం చేస్తున్నారు’’ అని ఆయన కామెంట్ చేశారు.
Updated Date - 2023-12-03T10:10:04+05:30 IST