Bombay High Court: చీమను చంపడానికి సుత్తిని తెస్తారా..?
ABN, First Publish Date - 2023-07-15T04:54:06+05:30
సామాజిక మాధ్యమాల్లో నకిలీ సమాచారాన్ని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనల సవరణలపై బాంబే హైకోర్టులో శుక్రవారం రెండో రోజు కూడా వాదనలు కొనసాగాయి.
నకిలీ వార్తల అదుపు పేరుతో కఠిన నిబంధనలు
వీటిపై ఆతృత ఎందుకు?.. దీనిని నిర్ణయించేది ఎవరు?
కేంద్రం చేతిలో అపరిమిత అధికారాలా?
ప్రశ్నించే హక్కు ప్రజలకుంది, ప్రభుత్వం స్పందించాల్సిందే
ఐటీ రూల్స్ సవరణపై బాంబే హైకోర్టు ప్రశ్నలు
న్యూఢిల్లీ, జులై 14: సామాజిక మాధ్యమాల్లో నకిలీ సమాచారాన్ని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనల సవరణలపై బాంబే హైకోర్టులో శుక్రవారం రెండో రోజు కూడా వాదనలు కొనసాగాయి. ఇవి ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు ఇస్తున్నాయని భావించిన హైకోర్టు ‘చీమను చంపడానికి సుత్తిని తీసుకురాలేరు’ అని వ్యాఖ్యానించింది. ఏది నకిలీ, ఏది తప్పుడు, ఏది తప్పుదోవ పట్టించే సమాచారమో నిర్ణయించే సంపూర్ణ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ ఈ నిబంధనలను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందో అసలు అర్థం కావడం లేదని తెలిపింది. ఈ సవరణలను సవాలు చేస్తూ ప్రముఖ కమేడియన్ కునాల్ కమ్ర, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజైన్స్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ గౌతం పటేల్, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనం విచారణ జరుపుతోంది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజైన్స్ తరఫున న్యాయవాది గౌతం భాటియా వాదనలు వినిపిస్తూ ఫేక్ న్యూస్‌ను అరికట్టడానికి ఇంత కఠినత్వం అవసరం లేని నిబంధనలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియలో పౌరుల మాదిరిగానే ప్రభుత్వం కూడా భాగస్వామి అని తెలిపింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించి, సమాఽధానాల కోసం డిమాండు చేసే ప్రాథమిక హక్కు ప్రజలకు ఉందని పేర్కొంది.
వాటిపై స్పందించాల్సిన విధి కూడా ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. కేంద్రం ఏర్పాటు చేసే ఫ్యాక్ చెకింగ్ యూనిట్‌లో ఎవరు నిజాలను నిర్ధరిస్తారని ప్రశ్నించింది. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ చేప్పేదే తిరస్కరించడానికి వీల్లేని అంతిమ సత్యం అన్న భావన నెలకొందని తెలిపింది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అరికట్టడానికి ఏదో రూపంలో ఫ్యాక్ట్ చెకింగ్ అవసరమేనని, కానీ నిబంధనలు ఇంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ సవరణలు తీసుకురావడం వెనక ఉన్న ఆతృత ఏమిటో అర్థం కావడం లేదని జస్టిస్ పటేల్ అన్నారు. ఇంటర్నెట్‌లో ఎవరు ఏమైనా మారు పేరుతో చెప్పుకోవచ్చని, అలాంటి వారిని నకిలీ వ్యక్తిగా భావించలేమని ధర్మాసనం తెలిపింది. నకిలీ, తప్పుడు, తప్పుదోవపట్టించే సమాచారం అంటూ ఏ ప్రాతిపదికన హద్దులు నిర్ణయిస్తారని ప్రశ్నించింది.
ఇందుకు పౌరసత్వ చట్టాన్ని ఉదాహరణగా చూపింది. ఒకవేళ ఎవరైనా ఈ చట్టానికి వ్యతిరేకంగా రాస్తే అది ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని ఫేక్, తప్పుదోవపట్టించే సమాచారంగా పరిగణిస్తారా అని ప్రశ్నించింది. ప్రభుత్వం నియమించే సంస్థే ఏది నిజమో, ఏది అబద్ధమో ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించింది. ‘‘నిజమో, అబద్ధమో నిర్ణయించే అధికారం కోర్టుకు తప్ప ఇంకెవరికీ లేదు.’’ అని స్పష్టం చేసింది. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ లేనప్పటికీ ఇప్పటికే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సామాజిక మాధ్యమాల్లోని ఫేక్ న్యూస్‌పై ప్రకటనలు జారీ చేస్తోందని తెలిపింది. ఈ సవరణలు లేకుంటే సామాజిక మాధ్యమాలు దూకుడుగా వ్యవహరిస్తాయని ప్రభుత్వం భావిస్తోందా అని ధర్మాసనం ప్రశ్నించింది.
Updated Date - 2023-07-15T04:54:06+05:30 IST