Rishi Sunak : కేంబ్రిడ్జ్‌లో రామ కథకు హాజరైన రుషి సునాక్.. పీఎంగా కాదు, హిందువుగా..
ABN, First Publish Date - 2023-08-16T14:09:06+05:30
బ్రిటిష్ ప్రధాన మంత్రి రుషి సునాక్ మరోసారి తన హిందుత్వాన్ని చాటుకున్నారు. గతంలో సతీ సమేతంగా గోవును పూజించి అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన రామ కథ ప్రవచనానికి హాజరయ్యారు.
లండన్ : బ్రిటిష్ ప్రధాన మంత్రి రుషి సునాక్ (British PM Rishi Sunak) మరోసారి తన హిందుత్వాన్ని చాటుకున్నారు. గతంలో సతీ సమేతంగా గోవును పూజించి అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన రామ కథ ప్రవచనానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం తనకు గర్వకారణమని తెలిపారు. తాను ప్రధాన మంత్రి హోదాలో కాకుండా, కేవలం ఓ హిందువుగా మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని వినమ్రంగా తెలిపారు.
భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మంగళవారం రామ కథ ప్రవచనాన్ని నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక బోధకుడు మొరారి బాపు శ్రీరాముని చరితను వినిపించారు. ఈ కార్యక్రమంలో రుషి సునాక్ ‘జై సియారామ్’ నినాదాలు చేశారు.
రుషి సునాక్ మాట్లాడుతూ, భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మొరారి బాపు ప్రవచిస్తున్న రామ కథకు హాజరవడం గర్వకారణంమని, సంతోషంగా ఉందని తెలిపారు. తాను ప్రధాన మంత్రి హోదాలో కాకుండా, ఓ హిందువుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పారు. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవని తాను భావిస్తానని చెప్పారు. తన జీవితంలో ప్రతి అంశంలోనూ తన మత విశ్వాసాలు మార్గదర్శనం చేస్తున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలో, రుషి సునాక్ ‘‘జై సియారామ్’’ నినాదాలు చేస్తున్నట్లు కనిపించింది. ప్రవచనకర్త మొరారి బాపు ఆసీనులైన వేదికకు వెనుకవైపున హనుమంతుని చిత్రం ఉండటాన్ని ప్రస్తావిస్తూ, ‘‘బాపు వెనుక సువర్ణ హనుమంతుడు ఉన్నట్లుగానే, 10 డౌనింగ్ స్ట్రీట్‌లో నా డెస్క్ మీద స్వర్ణ గణేశుడు ఉండటం నాకు గర్వకారణం’’ అని చెప్పారు.
తాను బ్రిటిషర్‌ను, హిందువును అవడం తనకు గర్వకారణమని తెలిపారు. సౌతాంప్టన్లో తాను తన తోబుట్టువులతో కలిసి దేవాలయానికి వెళ్లేవాడినని చెప్పారు. తన జీవితంలో ప్రతిక్షణం శ్రీరాముడు స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. మొరారి బాపు చెప్తున్న రామాయణంతోపాటు భగవద్గీత, హనుమాన్ చాలీసాలను కూడా స్మరించుకుంటూ తాను ఇక్కడికి రావడానికి బయల్దేరానని చెప్పారు. సవాళ్లను ధైర్యంతో ఎదుర్కొనడానికి, అణకువతో ప్రవర్తించడానికి, నిస్వార్థంగా పని చేయడానికి తనకు శ్రీరాముడే స్ఫూర్తిప్రదాత అని తెలిపారు.
రుషి ఈ సందర్భంగా హారతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. సోమనాథ దేవాలయం నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ఆయనకు మొరారి బాపు బహూకరించారు.
ఇవి కూడా చదవండి :
Birthday wishes : కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ
Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పాయి నాయకత్వంతో దేశానికి గొప్ప మేలు : మోదీ
Updated Date - 2023-08-16T14:09:06+05:30 IST