PM Narendra Modi: ప్రధాని మోదీ, సీఎం యోగికి బెదిరింపులు.. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వ్యక్తినంటూ..
ABN, First Publish Date - 2023-11-21T21:48:35+05:30
ఈమధ్య బెదిరింపు కాల్స్ బాగా పెరిగిపోతున్నాయి. కొందరు దుండగులు సెలెబ్రిటీల్ని టార్గెట్ చేసుకొని.. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి...
ఈమధ్య బెదిరింపు కాల్స్ బాగా పెరిగిపోతున్నాయి. కొందరు దుండగులు సెలెబ్రిటీల్ని టార్గెట్ చేసుకొని.. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి ఇలాంటి బెదిరింపులు రాగా.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపులొచ్చాయి. ముంబయి కంట్రోల్ రూమ్‌కి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. తాను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడని, మోదీతో పాటు యోగి హత్యకు పథకం వేయాలని తనకు గ్యాంగ్ నుంచి ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నాడు. అంతేకాదు.. ముంబయిలోని జేజే ఆస్పత్రిని కూడా పేల్చేస్తానని హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, వెంటనే రంగంలోకి దిగారు. ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో పసిగట్టి.. ఆ వ్యక్తి ఆచూకీ కనుగొని.. అతడ్ని అరెస్ట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని ప్రశ్నిస్తున్నారు. అతని వెనుక ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు.
కాగా.. ప్రధాని మోదీకి ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన్ను హత్య చేస్తానంటూ బెదిరింపులొచ్చాయి. వన్డే వరల్డ్ కప్ సమయంలో మోదీని హత్య చేస్తామని, గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియంను కూడా పేల్చేస్తామని పోలీసులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ దాడులు చేయకుండా ఉండాలంటే, తనకు రూ.500 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఆల్రెడీ తన మనుషుల్ని రంగంలోకి దింపానని పేర్కొన్నాడు. ఈ మెయిల్స్ వచ్చిన వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే.. ఈ మెయిల్స్ ఐరోపా నుంచి వచ్చినట్టు తేలింది. అయితే.. ఆ దుండగుడ్ని మాత్రం గుర్తించలేకపోయారు. దీనికితోడు.. ఈ ఏడాది ఆగస్టులో కేరళ పర్యటన సందర్భంగా ప్రధానిపై ఆత్మాహుతి దాడి చేస్తామని బెదిరింపులు రాగా, పోలీసులు వెంటనే అప్రమత్తమై విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే.. ఈ కేసులో ఒక చిన్న ట్విస్ట్ వెలుగు చూసింది. పొరుగింటి వ్యక్తిని, తన మిత్రుడిని కేసులో ఇరికించడానికే తాను ఈ పని చేశానని నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు.
Updated Date - 2023-11-21T21:48:37+05:30 IST