India-Canada Row: భారత్-కెనడా వివాదం.. భారత్‌లోని ఈ నగరాల్లో జాగ్రత్తగా ఉండాలని కెనడా హెచ్చరిక
ABN, First Publish Date - 2023-10-20T16:49:51+05:30
భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తత ఇప్పుడప్పుడు తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ ఇరుదేశాల మధ్య వైరం సుదీర్ఘకాలం కొనసాగేలా కనిపిస్తోంది. ఇందుకు తాజా పరిణామాలే సాక్ష్యం..
భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తత ఇప్పుడప్పుడు తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ ఇరుదేశాల మధ్య వైరం సుదీర్ఘకాలం కొనసాగేలా కనిపిస్తోంది. ఇందుకు తాజా పరిణామాలే సాక్ష్యం. భారత ప్రభుత్వం జారీ చేసిన అల్టిమేటం ప్రకారం తమ 41 దౌత్యాధికారుల్ని తిరిగి పిలిపించుకున్న కెనడా.. భారతదేశంలోని కొన్ని దౌత్యకార్యాలయాలు, కాన్సులేట్‌లను మూసివేసిన కొన్ని గంటలకే తమ పౌరుల కోసం ఒక అడ్వైజరీ జారీ చేసింది. దేశవ్యాప్తంగా తీవ్రవాద దాడుల ముప్పు ఉన్నందున భారత్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ అడ్వైజరీలో పేర్కొంది.
‘‘కెనడా, భారత్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో భారతదేశంలో కెనడాకు వ్యతిరేకంగా నిరసనలు జరగొచ్చు. సాధారణ మీడియా, సోషల్ మీడియాలోనూ కెనడా పట్ల ప్రతికూల భావాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కెనడా వ్యతిరేక నిరసనలతో పాటు ప్రదర్శనలు జరిగే అవకాశం ఉంది. కెనడియన్లు బెదిరింపులు లేదా వేధింపులకు గురి కావచ్చు కూడా. కాబట్టి.. భారత్‌లో ఉంటున్న కెనడియన్లు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా.. దేశ రాజధాని ఢిల్లీలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు’’ అంటూ సూచించింది. ఈ మేరకు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అడ్వైజరీని జారీ చేశారు.
బెంగళూరు, చండీగఢ్, ముంబయితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని మెలానీ చెప్పారు. వ్యక్తిగతంగా కాన్సులర్ సేవలు ఆ నగరాల్లో తాత్కాలికంగా ఉండవని, అందుకే అప్రమత్తంగా ఉండమని సూచించారు. పిక్ పాకెటింగ్, పర్సు స్నాచింగ్ వంటి చిన్న చిన్న నేరాలు సర్వసాధారణమని.. నేరస్థులు విదేశీయులను లక్ష్యంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో రద్దీగా ఉండే ప్రదేశాలలో కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని.. పెద్ద మొత్తంలో డబ్బును తీసుకెళ్లవద్దని ఆయన సలహా ఇచ్చారు.
మరోవైపు.. ఇప్పటివరకూ భారతదేశంలో 62 మంది కెనడా దౌత్యవేత్తలు ఉండగా, వారిలో 41 మందిని తిరిగి వెనక్కు పిలిచినట్లు కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. మిగిలిన 21 మంది దౌత్యవేత్తలు భారత్‌లోనే ఉంటారని స్పష్టం చేసింది. శుక్రవారంలోలా దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించిందని, ఆ అల్టిమేటం నేపథ్యంలో తమ దౌత్యాధికారుల్ని తిరిగి వెనక్కు పిలిపించుకున్నామని మెలానీ జోలీ తెలిపారు.
Updated Date - 2023-10-20T16:49:51+05:30 IST