Cold Tiger Claw : ఆసిఫాబాద్ ఏజెన్సీపై చలి పులి పంజా
ABN, First Publish Date - 2023-12-11T03:34:43+05:30
రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో.. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
సిర్పూర్(యు)లో మళ్లీ అత్యల్ప ఉష్ణోగ్రతలు
కనిష్ఠంగా 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
గిన్నెధరిలో 11.7.. ఆసిఫాబాద్‌లో 12.2
చాలా జిల్లాల్లో 15 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు
రాజధాని హైదరాబాద్‌లో సాధారణం కంటే
3-4 డిగ్రీలు తక్కువ నమోదు
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో.. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని సిర్పూర్(యు) మండలంలో ఆదివారం అత్యల్పంగా 10.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. తిర్యాణి మండలం గిన్నెధరిలో 11.7, ఆసిఫాబాద్ మండలంలో 12.2, కెరమెరి మండలంలో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలకు చేరింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లిలో 14 డిగ్రీల చలి వణికించింది. అలాగే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం 12.8, వికారాబాద్ జిల్లాలో 13.1, మెదక్ జిల్లా రామాయంపేటలో 14.1, మేడ్చల్ జిల్లాలో 14.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో సాధారణం కంటే 3-4 డిగ్రీల మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పటాన్‌చెరులో అత్యల్పంగా 14.6 డిగ్రీలు నమోదైంది. హనుమకొండలో ఆదివారం చలి అత్యల్పంగా 14.2 డిగ్రీలకు చేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు తుఫాను తర్వాత మరింత పడిపోయాయి. కారేపల్లి, కొత్తగూడెం జిల్లాలో గుండాలలో ఆదివారం అత్యల్పంగా 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇలాగే 15 డిగ్రీలలోపే నమోదవుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు.
Updated Date - 2023-12-11T03:34:47+05:30 IST