Rashmika Deepfake: రష్మిక డీప్‌ఫేక్ కేసులో కీలక పరిణామం.. నలుగురు నిందితులు ట్రాక్.. కానీ!!
ABN, Publish Date - Dec 20 , 2023 | 07:06 PM
సినీ నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నలుగురి అనుమానుతుల్ని ట్రాక్ చేశామని పోలీసులు అన్నారు. అయితే.. ఈ నలుగురు క్రియేటర్లు కాదని..
Rashmika Mandanna Deepfake Case: సినీ నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నలుగురి అనుమానుతుల్ని ట్రాక్ చేశామని పోలీసులు అన్నారు. అయితే.. ఈ నలుగురు క్రియేటర్లు కాదని, కేవలం అప్‌లోడర్లు మాత్రమేనని అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు (క్రియేటర్) మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతని కోసం సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మెటా సంస్థ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహించే సంస్థ) అందించిన వివరాల ఆధారంగా తాము ఈ నలుగురు అనుమానితుల్లో ముగ్గురిని ట్రాక్ చేశామని వివరణ ఇచ్చారు.
ఈ డీప్‌ఫేక్ కేసులో విచారణ మొదలుపెట్టిన విషయం తెలిసి.. ఆ నిందితులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి సమాచారాన్ని తొలగించారని, దీంతో దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందని, ఆ నిందితుల్ని లొకేట్ చేయడం కష్టతరంగా మారిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులకు చెందిన సైబర్ విభాగం ప్రస్తుతం రష్మిక మందన్న వీడియోని క్రియేట్ చేసిన ప్రధాన సూత్రధారి కోసం వెతుకుతున్నారని చెప్పారు. ఫేక్ గుర్తింపు ద్వారా రష్మిక డీప్‌ఫేక్ వీడియోని అప్‌లోడ్ చేసి ఉండొచ్చని, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN)ని ఉపయోగించడం వల్ల నేరస్థుడిని ట్రాక్ చేయడానికి మరింత కష్టంగా మారిందని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే.. అతడ్ని పట్టుకునేదాకా తమ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
కాగా.. నవంబర్ 6వ తేదీన రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. అమితాభ్ బచ్చన్ లాంటి సీనియర్ హీరోలు సైతం ఈ వీడియోపై స్పందించారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చాలా ప్రమాదకరంగా మారిందని అన్నారు. ఇక అప్పటి నుంచి డిజిటల్ భద్రత విషయంపై ప్రతిఒక్కరూ చర్చించడం మొదలుపెట్టారు. ఢిల్లీ మహిళా కమిషన్ కూడా చర్య తీసుకోవాలని కోరింది. దీంతో.. ఈ డీప్‌ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్‌లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు. నవంబర్ 18న అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేశామని, అటువంటి కంటెంట్‌ను గుర్తించి తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తెలిపారు.
Updated Date - Dec 20 , 2023 | 07:06 PM