DK Shivakumar: కిం కర్తవ్యం? మద్దతుదారులతో సమావేశమైన డీకే
ABN, First Publish Date - 2023-05-17T18:07:34+05:30
న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుండగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పగ్గాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అధిష్ఠానం పెద్దలనందరినీ కలుసుకుంటున్న డీకే శివకుమార్ తన మద్దతుదారులు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తన సోదరుడు, పార్టీ ఎంకీ డేకే సురేష్ నివాసంలో వీరంతా సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుండగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పగ్గాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అధిష్ఠానం పెద్దలనందరినీ కలుసుకుంటున్న డీకే శివకుమార్ (DK Shivakumar) తన మద్దతుదారులు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తన సోదరుడు, పార్టీ ఎంకీ డేకే సురేష్ నివాసంలో వీరంతా సమావేశమయ్యారు. దీనికి ముందు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ నివాసానికి వెళ్లి ఆయనతో డీకే రెండు గంటల సేపు సమావేశమయ్యారు. ఆ తర్వాత తన సోదరుడి ఇంటికి బయలుదేరుతూ మీడియా ప్రశ్నలకు మాత్రం సమాధానం దాటవేశారు.
ఖర్గే ఆఫర్...?
ఆ ఒక్కటి తప్ప (సీఎం సీటు) ఇంకేదైనా ఇవ్వడానికి సిద్ధం..అంటూ అధిష్ఠానం పెద్దలు డీకేను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఖర్గేతో ఆయన జరిపిన సమావేశంలోనూ ఇదే ముచ్చట వచ్చిందంటున్నారు. డీకేకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 6 మంత్రి పదవులు కేటాయించడం, కేపీసీసీ చీఫ్‌గా కొనసాగించడం వంటి ప్రతిపాదనలను ఆయన ముందు ఉంచినట్టు చెబుతున్నారు. డీకే సమాధానం మాత్రం తెలియరాలేదు. అయితే, ఇస్తే సీఎం పదవి, లేకుంటే ఏ పదవి లేకుండా ఎమ్మెల్యేగానే కొనసాగుతానని డీకే మొదట్నించీ చెబుతుండటంతో అధిష్ఠానం పెద్దలు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు.
మరోసారి రాహుల్‌తో డీకే, సిద్ధూ
కాగా, సీఎం ప్రకటనపై అధిష్ఠానం సంయమనం పాటిస్తుండగా, సాయంత్రం మరోమారు రాహుల్ గాంధీని డీకే శివకుమార్, సిద్ధరామయ్య కలుసుకోనున్నారు. డీకే ఇప్పటికే ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్ కోరారు. సోనియాగాంధీ సైతం హిమాచల్ నుంచి ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం ఎవరనే నిర్ణయం ప్రకటించడానికి మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంకేతంగా రాబోయే 48 గంటల నుంచి 72 గంటల్లోపు కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి సూర్జేవాలా మీడియాకు తెలిపారు. ఈలోపు ఎలాంటి ఊహాగానాలు, వదంతులు చేయవద్దని కోరారు. ఇదే సమయంలో, సిద్ధరామయ్యకే సీఎం పదవి అంటూ జాతీయ మీడియా వార్తలతో బెంగళూరులో మందుగానే సిద్ధరామయ్య అభిమానులు సంబరాలు మొదలుపెట్టేశారు. కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు సైతం చకచగా జరిగిపోతున్నాయి.
Updated Date - 2023-05-17T18:11:14+05:30 IST