Elections: మోగిన నగారా!
ABN, First Publish Date - 2023-01-19T02:59:27+05:30
కొత్త ఏడాది ప్రారంభంలోనే మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది.
3 ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు
నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ
అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ జారీ
త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్,
మేఘాలయలో 27న పోలింగ్
మార్చి 2న ఫలితాల వెల్లడి
వెల్లడించిన సీఈసీ రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): కొత్త ఏడాది ప్రారంభంలోనే మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) రాజీవ్ కుమార్ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాలకూ వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా పోలింగ్ కూడా వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తామని, అయితే.. మూడు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. మొత్తం ప్రక్రియ మార్చిలో ముగుస్తుందని వివరించారు. పాఠశాల విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరిలోనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, మార్చి 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను వెలువరిస్తామని తెలిపారు. 50 శాతం పోలింగ్‌బూత్‌లను వెబ్‌కాస్ట్ చేయనున్నట్టు చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన నకిలీ వార్తల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, మూడు రాష్ట్రాల్లోనూ ఎన్నికల పరిశీలకులను నియమించనున్నామని తెలిపారు.
కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో గతంలో జరిగిన పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తే మహిళా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని, ఇది మంచి పరిణామమని రాజీవ్‌కుమార్ చెప్పారు. ఎన్నికలకు ముందు, తర్వాత జరిగే హింసపై మాట్లాడుతూ.. ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందని, ఇలాంటి హింసను ఉపేక్షించబోమన్నారు. మూడు రాష్ట్రాల్లోని 180 నియోజకవర్గాల్లో 62.8 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. మూడు రాష్ట్రాల్లో 2.8 లక్షల మంది కొత్త ఓటర్లు అదనంగా చేరినట్లు వెల్లడించారు. కాగా, త్రిపురలో బీజేపీ, నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీ), మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) అధికారంలో ఉన్నాయి.
ఉప ఎన్నికలు కూడా..
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. మహారాష్ట్రలోని కస్బపేట్, చించ్వాడ అసెంబ్లీ నియోజకవర్గాలు, అరుణాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోని ఒక్కొక్క అసెంబీ నియోజకవర్గానికి ఫిబ్రవరి 27న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు వివరించారు. లక్షద్వీప్ లోక్‌సభ స్థానానికి కూడా అదే రోజు ఉప ఎన్నిక జరుగుతుందని తెలిపారు.
త్రిపుర
నోటిఫికేషన్ జారీ: జనవరి 21
నామినేషన్లకు ఆఖరి తేదీ: జనవరి 30
నామినేషన్ల స్ర్కూటినీ: జనవరి 31
నామినేషన్ల ఉపసంహరణ: ఫిబ్రవరి 2
పోలింగ్ జరిగే తేదీ: ఫిబ్రవరి 16
మేఘాలయ, నాగాలాండ్
నోటిఫికేషన్ జారీ: జనవరి 31
నామినేషన్లకు ఆఖరి తేదీ: ఫిబ్రవరి 7
నామినేషన్ల స్ర్కూటినీ: ఫిబ్రవరి 8
నామినేషన్ల ఉపసంహరణ: ఫిబ్రవరి 10
పోలింగ్ జరిగే తేదీ: ఫిబ్రవరి 27
Updated Date - 2023-01-19T02:59:28+05:30 IST