Emoji : అమ్మో బొమ్మ
ABN, First Publish Date - 2023-07-29T04:07:42+05:30
పేరెందుకుగానీ.. అనగనగా కెనడాలో ఒక రైతు. అవిసె గింజలు పండిస్తుంటాడు. 2021లో.. ఒక కొనుగోలుదారు ఆ రైతుకు ఫోన్ చేసి 86 టన్నుల అవిసెగింజలు కావాలని అడిగాడు. ఆ తర్వాత వాట్సా్‌పలో దీనికి సంబంధించిన ఒప్పందపత్రాన్ని కూడా పంపాడు. దాని చివర్లో.. ‘ఈ కాంట్రాక్ట్‌ను

ఎమోజీలను ఈజీగా తీసుకోవద్దు!..
చాటింగ్‌లో వీటి వాడకంతో సమస్యలు..
కోర్టుల దాకా వెళ్తున్న కొన్ని వ్యవహారాలు
కెనడాలో వాట్సా్‌పలో ‘థమ్సప్’ ఎమోజీ పెట్టిన రైతుకు రూ.50 లక్షల జరిమానా
ఇజ్రాయెల్‌లో కోర్టుకెక్కిన అద్దె ఇంటి గోల
ఎమోజీల ఆధారంగానే తీర్పు చెప్పిన కోర్టు
యూఎస్‌లో పెరుగుతున్న ఈ తరహా కేసులు
ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కలిపి ఎన్ని ఉంటాయి? ప్రపంచ భాషల కేటలాగ్ రూపొందించే ‘ఎత్నోలోగ్’ వెబ్‌సైట్ ప్రకారం జూలై 25 నాటికి అన్ని దేశాల్లోనూ కలిపి గుర్తింపు పొందిన భాషలు 7,168. లిపి లేని, గుర్తింపునకు నోచుకోని భాషలు ఇంకెన్నో! ఈ భాషలతో ఉన్న ఒకే ఒక సమస్య.. ప్రతి భాషా దాన్ని మాట్లాడేవారికి తప్ప మిగతావారికి తెలియదు. నేర్చుకుంటే తప్ప ఇతరులకు అర్థం కాదు. కానీ.. ఈ సమస్య అంతగా లేని భాష.. ప్రపంచంలో దాదాపు అందరికీ అర్థమయ్యే భాష.. పుట్టి ఇంకా మూడు దశాబ్దాలు కూడా కాని భాష ఒకటి ఉంది. అదే.. ఎమోజీ భాష! సామాజిక మాధ్యమాల్లోనూ, వాట్సాప్ వంటి మెసెంజర్లలోనూ.. ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కువగా వాడుతున్న భాష ఇది! అవతలి వ్యక్తి చెప్పిన జోక్‌కో.. రాసిన వ్యాసానికో.. మనం చాటభారతమంత రిప్లై ఇవ్వాల్సిన పని లేదు. ‘స్మైలీ (నవ్వుతున్న ముఖం)’ ఎమోజీనో.. ‘హార్ట్ (ప్రేమకు గుర్తుగా హృదయం)’ ఎమోజీనో.. వారు చెబుతున్నదానితో ఏకీభవిస్తున్నట్టు ‘థమ్సప్’ ఎమోజీనో పెడితే చాలు మన భావం వారికి అర్థమైపోతుంది. కానీ.. ఇటీవలికాలంలో ఈ ఎమోజీల భాషతోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి! ఎమోజీల దెబ్బకు కోర్టులకు కొత్త కొత్త చిక్కులతో కేసులూ వస్తున్నాయి!
ఎమోజీల సృష్టికర్త ఎవరు?
ఇప్పుడు ప్రపంచమంతా వాడుతున్న ఈ ఎమోజీల రూపకర్త ఎవరు? గూగుల్ చేస్తే ఈ ప్రశ్నకు సమాధానంగా జపాన్‌కు చెందిన షిగెటకా కురిటా పేరు వినిపిస్తుంది. ఈయన్ని ఎమోజీల సృష్టికర్తగా చాలామంది భావిస్తుంటారు. ఈయన జపాన్‌లో సుప్రసిద్ధ ఇంటర్‌ఫేస్ డిజైనర్. జపనీస్ టీనేజర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ‘ఎన్టీటీడొకొమో’ సంస్థ 1999లో అభివృద్ధి చేసిన పేజర్లలో.. ఎమోజీలను తయారుచేశారు. అందుకే ఎమోజీల సృష్టికర్తగా ఈయన పేరే ప్రముఖంగా వినపడుతుంది. కానీ, డొకొమో కన్నా రెండేళ్ల ముందే.. అంటే, 1997లోనే జపాన్‌కే చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కంపెనీ ఎమోజీ సెట్‌ను విడుదల చేసింది. ఆ సంస్థ 1997లో నవంబరులో తొట్టతొలి ఎమోజీ ఫోన్ ‘స్కైవాకర్ డీపీ 211 ఎస్‌డబ్ల్యూ’ను విడుదల చేసింది.
ఎమోజీ అంటే?
స్మైలీ, హార్ట్, థమ్సప్.. చాటింగుల్లో వాడే ఈ గుర్తులన్నింటినీ కలిపి మనం సింపుల్‌గా ఒక్కమాటలో ఎమోజీలు అనేస్తాం. ఇంతకీ ఎమోజీ అంటే ఏమిటి? జపనీస్ భాషలో ‘మోజీ’ అంటే అక్షరం లేదా క్యారక్టర్ అని అర్థం. ‘ఈ’ అంటే చిత్రం. ఎమోజీ అంటే.. బొమ్మతో కూడిన పదం అని అర్థం. ఇంగ్లి్‌షలో దీన్ని ఎమోటికాన్‌గా వ్యవహరిస్తారు. ఎమోషన్ (భావోద్వేగం)తో కూడిన ఐకాన్ అని దీని అర్థం.
( సెంట్రల్ డెస్క్)
పేరెందుకుగానీ.. అనగనగా కెనడాలో ఒక రైతు. అవిసె గింజలు పండిస్తుంటాడు. 2021లో.. ఒక కొనుగోలుదారు ఆ రైతుకు ఫోన్ చేసి 86 టన్నుల అవిసెగింజలు కావాలని అడిగాడు. ఆ తర్వాత వాట్సా్‌పలో దీనికి సంబంధించిన ఒప్పందపత్రాన్ని కూడా పంపాడు. దాని చివర్లో.. ‘ఈ కాంట్రాక్ట్‌ను ఆమోదిస్తే ఆ విషయాన్ని ధ్రువీకరించండి’ అనే వాక్యం ఉంది. ఆ వాట్సాప్ మెసేజ్‌కు సదరు రైతు.. బొటనవేలు పైకెత్తినట్టుగా ఉండే ‘థమ్సప్’ ఎమోజీతో సమాధానం ఇచ్చాడు. ఆ ఎమోజీని చూసి కొనుగోలుదారు ఈ ఒప్పందం ఖరారైనట్టే అనుకున్నాడు. కానీ.. ఎంతకీ సరుకు అందకపోవడంతో కోర్టుకెళ్లాడు. రైతేమో.. ఆ కొనుగోలుదారు పంపిన మెసేజ్ అందిందని చెప్పడానికి ఆ ఎమోజీ పెట్టానన్నాడు. ఒప్పందంపై తాను సంతకం చేయలేదు కాబట్టి దానికి తాను అంగీకరించినట్టు కాదని వాదించాడు. కానీ.. రైతు వాదనను కోర్టు ఆమోదించలేదు. థమ్సప్ సింబల్ పెట్టడమంటే ఆ కాంట్రాక్టుకు ఒప్పుకొన్నట్టేనని.. దాని ప్రకారం సరుకు పంపనందుకు 82,000 కెనడియన్ డాలర్ల జరిమానా కట్టాల్సిందేనని తీర్పునిచ్చింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.51 లక్షలు! డిక్షనరీ డాట్ కామ్ నిర్వచనం ప్రకారం.. ఎమోజీ అంటే డిజిటల్ కమ్యూనికేషన్స్‌లో మన ఆమోదాన్ని, ప్రోత్సాహాన్ని తెలిపేందుకు వాడే సాధనం. ఈ నిర్వచనం ఆధారంగానే కెనడా జడ్జి రైతుకు అంత భారీ జరిమానా వేశారు. థమ్సప్ ఎమోజీని పెట్టడం అంటే సంతకం పెట్టడం (డిజిటల్ సిగ్నేచర్)తో సమానమేనని తీర్పులో కూడా రాశారు. ఇలాంటిదే మరో ఉదాహరణ.. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నట్టు ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చాడు. దానికి ఒక వ్యక్తి స్పందించాడు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు, చాటింగ్‌లు జరిగాయి. ఇంటిని అద్దెకు తీసుకోవాలనుకున్న వ్యక్తి.. చాటింగ్ చేస్తున్నప్పుడు థమ్సప్ గుర్తు, షాంపేన్ సీసా, డాన్సింగ్‌గర్ల్ వంటి ఎమోజీలు పెట్టాడు. అతడు పెట్టిన ఈ బొమ్మలన్నింటినీ చూసిన ఇంటి యజమాని.. తన ఇల్లు అతడు అద్దెకు తీసుకుంటాడని భావించి ఆన్‌లైన్‌లో ఆ ప్రకటన తీసేశాడు. తీరా ఇతగాడు ఆ ఇంటిని అద్దెకు తీసుకోలేదు. దీంతో యజమాని కోర్టుకెళ్లాడు. కోర్టు వారిద్దరి చాటింగ్ చూసి.. ప్రతివాది పెట్టిన ఎమోజీలు యజమానిలో ఆశలు రేకెత్తించాయని, కాబట్టి అతడికి 8000 షెకెల్స్ (మన కరెన్సీలో రూ.1.72 లక్షలు) జరిమానా, దాంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.50 వేల దాకా చెల్లించాల్సిందేనని తీర్పునిచ్చింది. 2015లో ఫ్రాన్స్‌కు చెందిన ఒక వ్యక్తి తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌కు తుపాకీ ఎమోజీని పంపినందుకు.. స్థానిక కోర్టు 3 నెలల జైలు శిక్ష, 1000 యూరోల జరిమానా (దాదాపు రూ.90 వేలు) వేసింది. తుపాకీ ఎమోజీని పంపడమంటే చంపుతానని బెదిరించడమేనని స్పష్టం చేసింది. ఆ దేశంలో ఒక ఎమోజీకి సంబంధించిన తొలి కేసు ఇదే. అమెరికాలో.. ఈ ఎమోజీలకు సంబంధించిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2016లో అక్కడ ఈ తరహా కేసులు 26 నమోదు కాగా.. 2017లో 33, 2018లో 53 కేసులు నమోదయ్యాయి. 2019లో 94, 2020లో 124, 2021లో 154 కేసులు నమోదయ్యాయి.
అందరికీ అర్థమవుతాయిగానీ..
ఎమోజీలకు భాషతో పనిలేదు.. అవి అందరికీ అర్థమవుతాయనేమాట నిజమే. కానీ అది పాక్షిక నిజం మాత్రమే. అన్ని ఎమోజీలకూ అన్ని దేశాల్లో ఒకే అర్థం ఉండదు. ఉదాహరణకు.. ‘జోడించిన చేతులు’ ఎమోజీని మనం ఎవరికైనా కృతజ్ఞతలు తెలపడానికి పంపుతాం. కొన్నిదేశాల్లో ఆ ఎమోజీని ‘హైఫైవ్’ అనే అర్థంలో వాడుతారు. రజనీకాంత్ సినిమా ‘బాబా’ చూశారా? అందులో రజనీకాంత్ కుడిచేతి మధ్యవేలు, ఉంగరం వేలును బొటనవేలితో మూసి... చూపుడువేలు, చిటికెనవేలు తెరిచి ఒక ముద్రను చూపిస్తుంటాడు. ఆ ఎమోజీని మనం ‘కూల్’, ‘నో ప్రాబ్లెం’ అనే అర్థంలో వాడుతుంటాం. కానీ బ్రెజిల్‌వాసుల దృష్టిలో దానర్థం వివాహేతర సంబంధం. చూపుడువేలు వెనుకగా మధ్యవేలు ఉంచే ఎమోజీని వియత్నాంవాసులు స్త్రీ మర్మావయవానికి గుర్తుగా వాడతారు. ముక్కు నుంచి పొగలు వస్తున్నట్టుండే ఎమోజీని యూనికోడ్ కన్సార్షియం 2010లో రూపొందించింది. కన్సార్షియం దీన్ని ‘గెలుపు’నకు గుర్తుగా రూపొందిస్తే.. మనందరం దీన్ని కోపాన్ని తెలియజేయడానికి వాడుతున్నాం. ‘చెడు కనవద్దు’ అని సూచించే కోతి ఎమోజీని మనం ‘సిగ్గు’కు ప్రతీకగా వాడుతున్నాం. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా తేడాలున్నాయి. వాటిని రూపొందించిన ఉద్దేశం ఒకటైతే.. వాస్తవంలో మనం వేరే అర్థంలో వాడుతున్నాం. అమెరికా వంటి దేశాల్లో.. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు, మాదకద్రవ్యాల విక్రేతలు ఈ (ఎమోజీ) తరహా సంకేత భాష వాడడం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఎమోజీలకు మారారు. దీంతో ఫోరెన్సిక్ లింగ్వి్‌స్టలు ఎమోజీలపైన కూడా దృష్టి సారిస్తున్నారు.
Updated Date - 2023-07-29T04:07:58+05:30 IST