Fuel prices: తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే..?
ABN, First Publish Date - 2023-07-30T20:39:13+05:30
పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. క్రూడాయిల్ ధర గత ఏడాది 15 శాతం తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.10 చొప్పున తగ్గించాలని ఆయిల్ మార్కింటింగ్ కంపెనీలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. చివరిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను 2022 ఏప్రిల్‌లో తగ్గించారు.
న్యూఢిల్లీ: పెట్రోల్-డీజిల్ (Petrol-diesel) ధరలు తగ్గుముఖం పట్టబోతున్నాయా అనే ప్రశ్నకు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి ఔననే సమాధానం వస్తోంది. క్రూడాయిల్ ధర గత ఏడాది 15 శాతం తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.10 చొప్పున తగ్గించాలని కంపెనీలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారి 2022 ఏప్రిల్‌లో తగ్గాయి.
మూడు రెట్లు లాభాలు ఆర్జించిన ఆయిల్ కంపెనీలు
దేశీయ మార్గెట్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.100పైనే ఉండగా.. డీజిల్ ధర రూ.90 పైనే పలుకుతోంది. కాగా, పెట్రోలియం రిటైల్ బిజినెస్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ కంపెనీల ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం లీటర్‌కు రూ.10 చొప్పున ఈ కంపెనీలు సంపాదిస్తున్నాయి.
కాగా, ఈ ఏడాది ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కలిసి రూ.1 లక్ష కోట్లు లాభాలు ఆర్జించనున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ రూ.13,500 కోట్ల మేర లాభాలు సాధించగా, గత ఏడాది ఈ మూడు మూసాల్లో రూ.1,992 కోట్లు నష్టపోయింది. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ లాభాలు 2023-2024లో రూ.1 లక్ష కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా. 2017-2022 మధ్య ఈ కంపెనీలు ఏటా సగటున 60 వేల కోట్లు లాభాలు ఆర్జించాయి. 2022-23లో ఈ కంపెనీల మొత్తం ప్రావిట్ రూ.33,000 కోట్ల నుంచి మూడు రెట్లు పెరగనున్నట్టు అంచనా వేస్తున్నారు.
ఆయిల్ ధరలు తగ్గించే అవకాశం..
కాగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం లీటర్‌కు రూ.10 చొప్పున లాభాలు ఆర్జిస్తున్నాయని, ఆ కోణంలో చూసినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఎంతైనా ఉందని కోటక్ మహేంద్ర బ్యాంకులో సీనియర్ ఎకనామిస్ట్ ఉపాసనా భరద్వాజ్ తెలిపారు. ఇందువల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషించారు.
Updated Date - 2023-07-30T20:59:12+05:30 IST