H1B visa : ‘హెచ్1-బీ’ గ్రేస్ పీరియడ్ 180 రోజులు!
ABN, First Publish Date - 2023-03-16T04:30:23+05:30
హెచ్1-బీ వీసాదారులకు ఇస్తున్న గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలంటూ అమెరికా అధ్యక్షుని సలహా ఉపసంఘం (వలస వ్యవహారాలు) సిఫారసు చేసింది.
ఆ మేరకు గడువు పెంచాల్సిందే
60 రోజుల్లో కొత్త పని వెతుక్కోవడం కష్టం
దానివల్ల ప్రతిభావంతుల్ని కోల్పోతున్నాం
అమెరికా అధ్యక్షుని ఉపసంఘం సిఫారసు
కీలకంగా వ్యవహరించిన అజయ్ జైన్
వాషింగ్టన్, మార్చి 15: హెచ్1-బీ వీసాదారులకు ఇస్తున్న గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలంటూ అమెరికా అధ్యక్షుని సలహా ఉపసంఘం (వలస వ్యవహారాలు) సిఫారసు చేసింది. హెచ్1-బీ వీసాపై అమెరికాకు వచ్చినవారు తాము చేస్తున్న పనిని వదిలేసినా లేదా వారిని సంస్థ తొలగించినా కొత్త సంస్థలో అరవై రోజుల్లోగా చేరాలనే నియమం ఇప్పటివరకు ఉంది. లేదంటే తట్టాబుట్టా సర్దుకుని సొంత దేశాలకు వెళ్లాల్సిందే. అయితే, వారికి మరింత అదనపు సమయం ఇవ్వడం కోసం గ్రేస్ పీరియడ్‌ను పెంచాలని వలససేవల విభాగం, హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్టుమెంటులకు ఉపసంఘం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై ఉపసంఘంలో సభ్యుడు అజయ్ జైన్ భుటోరియా ప్రజంటేషన్ ఇచ్చారు. చేస్తున్న పని పోయి కొత్త ఉపాధిని సంపాదించుకోవడం హెచ్-1బీ వీసాదారులకు అమెరికాలో చాలా కష్టంగా ఉన్నదని ఆయన తెలిపారు. హెచ్-1బీ హోదా బదిలీకి సంబంధించిన పత్రాలు సంపాదించుకోవడంలోని సంక్లిష్టత, వలస సేవల విభాగంలో దరఖాస్తు పరిశీలనకు ఎక్కువ కాలం పడుతుండటం వంటి కారణాల వల్ల ఇప్పుడు ఇస్తున్న గ్రేస్ పీరియడ్ సరిపోవడం లేదన్నారు. దానివల్ల చాలామంది బలవంతంగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి వస్తున్నదని చెప్పారు. అందువల్ల ఇప్పుడిస్తున్న గ్రేస్ పీరియడ్‌కు అదనంగా మరో 120 రోజులు మంజూరు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
Updated Date - 2023-03-16T04:30:23+05:30 IST