Ayodhya Mosque: అయోధ్యలో అతిపెద్ద మసీదు.. శంకుస్థాపన చేసేందుకు మక్కా నుండి ఇమామ్
ABN, Publish Date - Dec 19 , 2023 | 09:48 PM
బాబ్రీ మసీదు వివాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9వ తేదీన మొత్తం స్థలాన్ని రామ మందిరం నిర్మాణానికి, మసీదు నిర్మించేందుకు మరో ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం..
Ayodhya Mosque: బాబ్రీ మసీదు వివాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9వ తేదీన మొత్తం స్థలాన్ని రామ మందిరం నిర్మాణానికి, మసీదు నిర్మించేందుకు మరో ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రామ మందిర నిర్మాణం పూర్తి కాబోతుండగా.. మసీదు నిర్మాణ పనుల్ని కూడా వేగవంతం చేశారు. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్‌లో ఈ మసీదుని దేశంలోనే అతిపెద్ద మసీదుగా నిర్మించబోతున్నారు. ఈ మసీదు శంకుస్థాపన కోసం మక్కాలోని కాబా పవిత్ర మసీదులో ఇమామ్-ఎ-హరమ్ (నమాజ్‌కు నాయకత్వం వహించే ఇమామ్) అయోధ్యకు రానున్నారు. ఈ మసీదుకి ‘మొహమ్మద్ బిన్ అబ్దుల్లా’ అనే పేరు ఖరారు చేశారు.
ముహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు డెవలప్‌మెంట్ కమిటీ ఛైర్మన్, ముంబైకి చెందిన బిజెపి నాయకుడు హాజీ అరాఫత్ షేక్ మాట్లాడుతూ.. అయోధ్యలోని కొత్త మసీదు భారతదేశంలోనే అతిపెద్దది అని పేర్కొన్నారు. అంతేకాదు.. 21 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు గల అతిపెద్ద ఖురాన్‌ను ఈ మసీదులో ఉంచబోతున్నట్టు స్పష్టం చేశారు. ఈ మసీదు నిర్మించే బాధ్యతల్ని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ తీసుకుంది. ఈ సందర్భంగా 2020 జులై 29వ తేదీన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది. 2023 అక్టోబర్‌లో ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ జుఫర్ అహ్మద్ ఫరూఖీ హాజరయ్యారు. అప్పుడే ఈ మసీదుకు ‘ముహమ్మద్ బిన్ అబ్దుల్లా’ అని పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇస్లాం ఐదు పిల్లర్స్ అయిన కలిమా, నమాజ్, రోజా, హజ్, జకాత్‌లకు ప్రతీకగా.. ఈ మసీదులో ఐదు మినార్లు ఉంటాయని షేక్ అరాఫత్ స్పష్టం చేశారు.
కేవలం మసీదు మాత్రమే కాదు.. కాంప్లెక్స్‌లో క్యాన్సర్ ఆసుపత్రి, పాఠశాలలు & కళాశాలలు, మ్యూజియం, ఒక లైబ్రరీ, సందర్శకులకు ఉచిత ఆహారం అందించే పూర్తిగా శాఖాహార వంటశాల కూడా ఉంటాయి. ఈ కాంప్లెక్స్‌లోని ప్రధాన ఆకర్షణగా వుజు ఖానా సమీపంలో భారీ అక్వేరియం ఏర్పాటు చేయబోతున్నట్టు షేక్ తెలిపారు. పురుషులు, మహిళలకు వేర్వేరు విభాగాలు ఉంటాయని.. ఈ మసీదు అందం తాజ్ మహల్ అందాన్ని మించిపోతుందని చెప్పారు. సాయంత్రం వేళ.. మసీదులోని ఫౌంటైన్లు విరాజిల్లుతాయని, ఈ అందం తాజ్‌మహల్ కంటే గొప్పగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రార్థన కోసం కాకపోయినా.. శాంతి, సామరస్యానికి సంబంధించిన ఈ స్మారక చిహ్నాన్ని చూడటానికి అన్ని మతాల ప్రజలు వస్తారని షేక్ అరాఫత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - Dec 19 , 2023 | 09:48 PM