India-Canada Row: కెనడాకు వీసా సర్వీసుల్ని పునఃప్రారంభించిన భారత్.. కానీ ఒక చిన్న మెలిక!
ABN, First Publish Date - 2023-10-25T22:08:03+05:30
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న కొత్తలో భారత ప్రభుత్వం కెనడియన్లకు వీసా సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సేవల్ని అక్టోబర్ 26వ తేదీ నుంచి పునఃప్రారంభించాలని...
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న కొత్తలో భారత ప్రభుత్వం కెనడియన్లకు వీసా సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సేవల్ని అక్టోబర్ 26వ తేదీ నుంచి పునఃప్రారంభించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు కెనడాలోని భారత్ హైకమిషన్ బుధవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అంశంలో కొన్ని కెనడియన్ చర్యలను పరిగణనలోకి తీసుకొని, భద్రతా పరిస్థితిని పరిశీలించిన తర్వాత వీసా సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించడం జరిగిందని భారత్ హైకమిషన్ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే.. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా కేటగిరీల్లో వీసా సర్వీస్ ప్రారంభించినట్లు భారత హైకమిషన్ తెలిపింది.
రీసెంట్‌గానే వీసాల జారీని పునఃప్రారంభించే విషయంపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఒక అప్డేట్ ఇచ్చారు. వియన్నా కన్వెన్షన్ ప్రకారం.. కెనడాలో భారత దౌత్యవేత్తలకు భద్రత కల్పిస్తే, తాము వీసాల జారీని పునఃప్రారంభించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొన్న తర్వాత కెనడాలోని దౌత్యవేత్తలకు రక్షణ కరువైందని.. ఆ పరిస్థితుల్లో దౌత్యవేత్తలు వీసాలు జారీ చేసేందుకు కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వర్తించడం సురక్షితం కాదనే కారణంతోనే వీసాల జారీని భారత్ నిలిపివేసిందని స్పష్టం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల్లోనే.. వీసా సర్వీసుల్ని పునఃప్రారంభిస్తున్నట్టు భారత హైకమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం.
కాగా.. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయడం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడం, ఈ అంశంలో ఓ భారత దౌత్యాధికారిని బహిష్కరించడంతో దౌత్య వివాదం చెలరేగింది. భారత్ కూడా కెనడాకు కౌంటర్ ఇస్తూ.. ఆ ఆరోపణల్ని ఖండించడంతో పాటు కెనడా దౌత్యాధికారిని తిరిగి వెనక్కు పంపించింది. ఈ క్రమంలోనే వీసా సర్వీసుల్ని తాత్కాలికంగా ఆపేసింది. అలాగే.. 41 మంది దౌత్యాధికారుల్ని వెనక్కు పిలిపించుకోవాల్సిందిగా కెనడాకు అల్టిమేటం జారీ చేసింది. మరో దారి లేకపోవడంతో.. భారత్ హెచ్చరించినట్టు కెనడా 41 దౌత్యాధికారుల్ని వెనక్కు పిలిపించుకుంది.
Updated Date - 2023-10-25T22:08:03+05:30 IST