Union Finance Minister Nirmala Sitharaman : భారత మార్కెట్‌కు ఢోకా లేదు
ABN, First Publish Date - 2023-02-04T05:07:15+05:30
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనమవుతున్న వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ, నిబంధనల విషయంలో దేశీయ ఆర్థిక మార్కెట్ చాలా పటిష్ఠంగా ఉందని చెప్పారు. ఒక్క ఉదంతాన్ని ఆధారంగా చేసుకొని భారత మార్కెట్లను అంచనా
అదానీ షేర్ల పతనం ప్రభావం ‘బ్యాంకింగ్’పై ఉండదు: నిర్మల
ముంబై, ఫిబ్రవరి 3: అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనమవుతున్న వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ, నిబంధనల విషయంలో దేశీయ ఆర్థిక మార్కెట్ చాలా పటిష్ఠంగా ఉందని చెప్పారు. ఒక్క ఉదంతాన్ని ఆధారంగా చేసుకొని భారత మార్కెట్లను అంచనా వేయడం సరికాదన్నారు. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ భారీగా పెట్టుబడులు పెట్టాయని, నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారన్న విపక్షాల వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తమ మొత్తం పెట్టుబడుల్లో అదానీ కంపెనీల్లో ఉన్నవి చాలా తక్కువేనని ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ పేర్కొనడాన్ని నిర్మల ప్రస్తావించారు. శుక్రవారం ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అదానీ షేర్ల వ్యవహారంపై ప్రభుత్వం తరఫున తొలి అధికారిక స్పందన ఇదే కావడం గమనార్హం. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉందని నిర్మల ధీమా వ్యక్తం చేశారు. అదానీ షేర్ల పతనం ప్రభావం బ్యాంకింగ్ రంగంపై ఉండబోదని ఆమె చెప్పారు. విదేశీ మదుపర్లు గతంలో మాదిరిగానే భారత్‌లో నిశ్చింతగా పెట్టుబడులు పెట్టుకోవచ్చని నిర్మల తెలిపారు. భారత మార్కెట్లు చాలా పటిష్ఠంగా ఉన్నాయన్నారు. మదుపరులు దేశీయ మార్కెట్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని స్పష్టం చేశారు.
Updated Date - 2023-02-04T05:07:16+05:30 IST