Indian Navy : భారత నావికా దళం మరో ఘన విజయం..
ABN, First Publish Date - 2023-06-06T12:10:55+05:30
భారత నావికా దళం మంగళవారం చెప్పుకోదగ్గ మైలురాయిని దాటింది. మన దేశంలోనే తయారైన హెవీ వెయిట్ టార్పెడో (జలాంతర్గామి విధ్వంసక క్షిపణి)
న్యూఢిల్లీ : భారత నావికా దళం (Indian Navy) మంగళవారం చెప్పుకోదగ్గ మైలురాయిని దాటింది. మన దేశంలోనే తయారైన హెవీ వెయిట్ టార్పెడో (జలాంతర్గామి విధ్వంసక క్షిపణి) పరీక్షలు విజయవంతమయ్యాయి. సముద్రంలోపలి ప్రాంతంలో ఉన్న లక్ష్యాన్ని ఈ టార్పెడో విజయవంతంగా ధ్వంసం చేసింది. స్వయం సమృద్ధ భారత్ లక్ష్య సాధనలో ఇది గొప్ప ముందడుగు అని నావికా దళం వెల్లడించింది.
భారత నావికా దళం మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, మన దేశంలో అభివృద్ధిపరచిన హెవీవెయిట్ టార్పెడో సముద్ర గర్భంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్లు తెలిపింది. సముద్ర గర్భంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించే ఆయుధం కోసం జరుగుతున్న అన్వేషణలో భారత నావికా దళం, డీఆర్‌డీవో (రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ)లకు ఇది చెప్పుకోదగ్గ మైలురాయి అని పేర్కొంది.
భారత నావికా దళం ఇచ్చిన ఈ ట్వీట్‌లో ఎనిమిది సెకండ్ల వీడియో క్లిప్ కూడా ఉంది. పొడవైన రంగురంగుల వస్తువు సముద్ర ఉపరితలంపై ఉన్నట్లు ఈ వీడియోలో కనిపించింది. ఆ వస్తువు అకస్మాత్తుగా పేలిపోవడం కనిపించింది.
ఇదిలావుండగా, భారత నావికా దళం మే 31న మరో రికార్డు సృష్టించింది. మన దేశంలోనే డిజైన్ చేసి, నిర్మించిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పైకి ఎంహెచ్60ఆర్ హెలికాప్టర్ దిగింది. దీనివల్ల జలాంతర్గాముల నిరోధక యుద్ధంలో నావికా దళం మరింత బలోపేతమైంది. ఎంహెచ్-60 అనేది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగలిగే హెలికాప్టర్. ఇది మల్టీ రోల్ హెలికాప్టర్.
ఇవి కూడా చదవండి :
Odisha train accident: 48 గంటల తర్వాత సజీవంగా కనిపించిన వ్యక్తి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..
America : భారత్ శక్తిమంతమైన, జీవచైతన్యంగల ప్రజాస్వామిక దేశం : అమెరికా
Updated Date - 2023-06-06T12:10:55+05:30 IST