RRR team : భారతీయత ఉట్టిపడేలా..
ABN, First Publish Date - 2023-03-14T03:57:51+05:30
ఆస్కార్ వేడుకలనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి ఘనమైన రెడ్‌కార్పెట్ స్వాగతం! కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్‌తో అద్భుతంగా ముస్తాబై వచ్చి.. ఆ కార్పెట్‌పై నడిచే ప్రపంచ ప్రఖ్యాత తారలు!!
సంప్రదాయ దుస్తుల్లో ఆర్‌ఆర్‌ఆర్ బృందం
లాస్‌ఏంజెలెస్, మార్చి 13: ఆస్కార్ వేడుకలనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి ఘనమైన రెడ్‌కార్పెట్ స్వాగతం! కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్‌తో అద్భుతంగా ముస్తాబై వచ్చి.. ఆ కార్పెట్‌పై నడిచే ప్రపంచ ప్రఖ్యాత తారలు!! అయితే, ఈసారి రెడ్ కార్పెట్‌కు బదులు నిర్వాహకులు షాంపేన్ రంగు కార్పెట్‌ను పరిచారు. రంగేదైతేనేం.. సంప్రదాయ భారతీయ దుస్తుల్లో మనోళ్లు ఆ కార్పెట్‌పై మెరిసిపోయారు. మరీ ముఖ్యంగా.. ‘నాటు నాటు’ పాట హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో తమ తమ పాత్రలకు సంబంధించిన థీమ్‌లతో కూడిన దుస్తులను ధరించడం అందరినీ ఆకట్టుకుంది. దర్శకుడు రాజమౌళి.. సంప్రదాయ ధోవతి, లేత ధూమ్రవర్ణంలోని సిల్క్ కుర్తా ధరించగా, ఎన్టీఆర్, రామ్‌చరణ్ నలుపు రంగ్ వెల్వెట్ బాంద్‌గలా షేర్వానీలు ధరించారు. సినిమాలో రామ్‌చరణ్ బ్రిటిషర్ల వద్ద పనిచేసే సైనికుడి పాత్ర పోషించిన నేపథ్యంలో.. చెర్రీ సూట్‌కు మెడల్ తరహా బ్రూచ్ పెట్టారు. రామ్‌చరణ్ భార్య ఉపాసన తెల్లటి చీరలో మెరిసిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ సూట్‌పై.. సినిమాలో పులితో పోరాటాన్ని గుర్తుచేసేలా పులిని ఎంబ్రాయిడరీ చేశారు. కీరవాణి, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ కూడా భారతీయ సంప్రదాయ దుస్తులే ధరించారు. రచయిత చంద్రబోస్ మాత్రం బ్లాక్ అండ్ వైట్ సూట్ ధరించారు. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా పదుకొనే.. లూయీస్ వూయిట్టన్ బ్లాక్ గౌన్ ధరించారు. అటు.. ‘ద ఎలిఫెంట్ విష్పరర్స్’ దర్శక, నిర్మాతలైన కార్తీకి, గునీత్ మోంగా కూడా భారతీయ సంప్రదాయ వస్త్రాలే ధరించారు.
Updated Date - 2023-03-14T03:57:51+05:30 IST