IndiGo Flight: పక్షీ.. ఎంత పని చేశావే.. విమానాన్నే హడలెత్తించావ్‌గా.. దెబ్బకు ఎమర్జెన్సీ ల్యాండింగ్
ABN, First Publish Date - 2023-09-04T17:02:29+05:30
అనుకోకుండా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినప్పుడో.. ప్రయాణికుల్లో ఎవరైనా ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైనప్పుడో.. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు విమానాలను అత్యవసర ల్యాండింగ్...
అనుకోకుండా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినప్పుడో.. ప్రయాణికుల్లో ఎవరైనా ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైనప్పుడో.. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేస్తారు. కానీ.. ఇక్కడ ఒక పక్షి చేసిన పనికి ఓ విమానాన్ని ఎమెర్జన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. ఒక పక్షి దూసుకొచ్చి విమానాన్ని ఢీకొట్టింది. ఈ దెబ్బకు విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఇండిగో సంస్థకు చెందిన 6E2065 విమానం.. సోమవారం 180 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. బిజు పట్నాయక్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈ విమానం టేకాఫ్ అయ్యి గాల్లో ఎగరగా.. 20 నిమిషాల తర్వాత ఒక పక్షి ఈ విమానాన్ని ఢీకొట్టింది. దీంతో.. విమానం ఎడమ రెక్కలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్.. విమానాన్ని వెంటనే వెనక్కు మళ్లించి, అత్యవసరంగా ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన తర్వాత.. ప్రయాణికులను ప్రత్యమ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటనపై ఒక అధికారి మాట్లాడుతూ.. విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక సాంకేతిక సమస్య తలెత్తిన విషయాన్ని పైలట్ గుర్తించారన్నారు. దాంతో ఆయన వెంటనే వెనక్కు మళ్లించి, ఉదయం 8:20 గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారన్నారు. మరో అధికారి మాట్లాడుతూ.. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలవ్వలేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని అన్నారు. ఒక పక్షి ఢీకొట్టడం వల్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు గుర్తించామని తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి అనుమతులు పొందిన తర్వాతే ఈ విమానం మళ్లీ ఎగురుతుందని స్పష్టం చేశారు.
Updated Date - 2023-09-04T17:02:29+05:30 IST