INS Vagir ; నేవీ అమ్ములపొదిలోకి ఐఎన్‌ఎస్ వాగిర్
ABN, First Publish Date - 2023-01-24T02:51:43+05:30
నేవీ అమ్ముల పొదిలోకి ఐఎన్‌ఎస్ వాగిర్ జలాంతర్గామి చేరింది. సోమవారం ముంబైలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ సమక్షంలో ఈ జలాంతర్గామి నౌకాదళంలోకి రంగప్రవేశం చేసింది.
ముంబై, జనవరి 23: నేవీ అమ్ముల పొదిలోకి ఐఎన్‌ఎస్ వాగిర్ జలాంతర్గామి చేరింది. సోమవారం ముంబైలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ సమక్షంలో ఈ జలాంతర్గామి నౌకాదళంలోకి రంగప్రవేశం చేసింది. హిందూ మహాసముద్రంలో చైనా నావికాదళం కదలికలు పెరిగిన కీలక సమయంలో ఐఎన్‌ఎస్ వాగిర్ రాక ప్రాధాన్యం సంతరించుకొంది. ‘వాగిర్ అంటే ఇసుక సొర చేప అని అర్థం. స్టీల్త్(రాడార్‌కు చిక్కకుండా), నిర్భీతి అనే రెండు ప్రత్యేక లక్షణాలు దీని సొంతం’ అని నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. దీని అత్యాధునిక స్టీల్త్ టెక్నాలజీ, తిరుగులేని ఆయుధ సంపత్తి నేవీతోపాటు భారతదేశం బలాన్ని మరింత పెంచనున్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ పేర్కొన్నారు. ఇది రెండేళ్ల వ్యవధిలోనే నేవీలో చేరిన మూడో జలాంతర్గామి అన్నారు. ‘ఇదేమీ చిన్న ఘనత కాదు. మన షిప్‌యార్డుల నైపుణ్యం, అనుభవాలకు ఇది ప్రతీక. రాబోయే తరంలో దేశ నౌకా నిర్మాణ పరిశ్రమ ఎలా ఉండబోతోందో, మన రక్షణ సామర్థ్యం ఏ స్థాయికి చేరనుందో ఇది తెలియజేస్తోంది’ అని పేర్కొన్నారు.
ఇవీ ప్రత్యేకతలు..
ఇది కావేరీ తరగతికి చెందిన జలాతర్గాముల్లో ఐదవది. ఫ్రాన్స్ నుంచి పొందిన సాంకేతిక పరిజ్ఞానంతో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీన్ని తయారు చేసింది. ప్రపంచంలో అత్యుత్తమ సెన్సర్లలో కొన్ని దీనిలో వినియోగించారు. మెరైన్ కమాండోలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించేందుకూ ఇది అనుకూలం. దీనిలోని శక్తిమంతమైన డీజిల్ ఇంజిన్లు స్టీల్త్ మిషన్ కోసం అత్యంతవేగంగా బ్యాటరీలను చార్జింగ్ చేస్తాయి. స్వీయ రక్షణ కోసం దీనిలో అత్యాధునిక టార్పెడో డెకాయ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
Updated Date - 2023-01-24T02:51:44+05:30 IST