Nambi Narayanan: గూఢచర్యం అబద్ధం, అరెస్టు చట్టవిరుద్ధం: కేరళ హైకోర్టుకు చెప్పిన సీబీఐ
ABN, First Publish Date - 2023-01-13T15:55:27+05:30
ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై గూఢచర్యం కేసు అబద్ధమని, అతని అరెస్టు చట్టవిరుద్ధమని కేంద్ర దర్యాప్తు సంస్థ...
న్యూఢిల్లీ: ప్రముఖ ఇస్రో (ISRO) శాస్త్రవేత్త నంబి నారాయణన్ (Nambi Narayanan)పై గూఢచర్యం కేసు (Espinage Case) అబద్ధమని, అతని అరెస్టు చట్టవిరుద్ధమని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) శుక్రవారంనాడు కేరళ హైకోర్టుకు తెలియజేసింది. నంబి నారాయణన్‌పై 1994లో గూఢచర్యం కేసు నమోదు కాగా, 1996లో ఆయనను నిర్దోషిగా సీబీఐ ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తు అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నంబి నారాయణ్‌పై గూఢచర్యం కేసు అబద్ధమని కేరళ హైకోర్టుకు సీబీఐ తాజాగా తెలియచేసింది. నకిలీ గూఢచర్య కేసు జాతీయ భద్రతకు చెందిన తీవ్రమైన అంశమని, ఇస్రోలోని ప్రముఖ శాస్త్రవేత్తలపై తప్పుడు కేసులు పెట్టేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని కోర్టుకు దర్యాప్తు సంస్థ తెలియజేసింది.
నంబి నారాయణన్ తరఫు న్యాయవాది కూడా భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమంలో కీలకమైన క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీని నిలిపివేసేందుకు నంబి నారాయణన్‌పై కేసు నమోదు చేశారని కోర్టుకు తెలియజేశారు. 1990లో నంబి నారాయణన్‌పై దర్యాప్తు జరిపిన అధికారులపై సీబీఐ నమోదు చేసిన కేసు, నిందితుల బెయిల అభ్యర్థనలపై కేరళ హైకోర్టు విచారణ సందర్భంగా సీబీఐ తాజా వ్యాఖ్యలు చేసింది.
కేసు వివరాలివే...
దేశీయంగా క్రయోజనిక్ ఇంజన్ల తయారీ కోసం ఇస్రో కృషి చేస్తున్న తరుణంలో నంబి నారాయణన్‌పై 1994లో దేశద్రోహం కుట్ర జరిగింది. మాల్దీవులకు చెందిన ఓ మహిళ ద్వారా క్రయోజనిక్ టెక్నాలజీని పాక్‌కు అందజేస్తున్నారన్న ఆరోపణలపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కాలంలో నంబి నారాయణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత కేసు సీబీఐకి బదిలీ అయింది. 1996లో నంబి నారాయణన్‌ను సీబీఐ నిర్దోషిగా ప్రకటించింది. కేరళ హైకోర్టు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ప్రయత్నించగా అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇస్రో అంతర్గత విచారణలోనూ క్రయోజనిక్ టెక్నాలజీ లీక్ కాలేదని తేల్చిచెప్పింది. దీంతో 2018లో కేరళ ప్రభుత్వంపై నంబి నారాయణ్ కేసు పెట్టగా, దీపక్ మిశ్రా సారథ్యంలోని సుప్రీం ధర్మాసం ఆయనకు రూ.50 లక్షలు పరిహారంగా ఇవ్వాలని కేరళ సర్కార్‌ను సుప్రీంకోర్టు అదేశించింది. కేరళ సర్కార్ సైతం ఆయనకు రూ.1.3 కోట్లు పరిహారంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. 2019లో నంబి నారాయణన్‌ను భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారమైన ''పద్మభూషణ్''తో భారత ప్రభుత్వం సత్కరించింది. నంబి నారాయణన్ నిజజీవిత చరిత్ర ఆధారంగా ఆర్.మాధవన్ దర్శకత్వంలో 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' అనే పేరుతో సినిమా కూడా విడుదలైంది.
Updated Date - 2023-01-13T15:55:29+05:30 IST