Jai Shankar: ఐక్యరాజ్య సమితిలో జైశంకర్ ధ్వజం.. చైనా, పాకిస్తాన్, కెనడాలకు పరోక్షంగా చురకలు
ABN, First Publish Date - 2023-09-26T22:00:01+05:30
చైనా, పాకిస్తాన్, కెనడా.. ఈ మూడు దేశాలు భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఎప్పటి నుంచో భారత్‌పై విషం చిమ్ముతూనే ఉంది. సరిహద్దు విషయంలో భారత్, చైనా మధ్య వివాదాలు...
చైనా, పాకిస్తాన్, కెనడా.. ఈ మూడు దేశాలు భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఎప్పటి నుంచో భారత్‌పై విషం చిమ్ముతూనే ఉంది. సరిహద్దు విషయంలో భారత్, చైనా మధ్య వివాదాలు సాగుతున్నాయి. ఇక రీసెంట్‌గా భారత్‌పై నిరాధార ఆరోపణలు చేసి, దౌత్య వివాదానికి కెనడా తెరలేపింది. ఇలా మూడు దేశాలు భారత్‌తో రగడ పెట్టుకున్న నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆ మూడు దేశాలకు పరోక్షంగా చురకలంటించారు.
తొలుత కెనడా వివాదంపై పరోక్షంగా మాట్లాడుతూ.. ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసపై మన ప్రతిస్పందన రాజకీయ సౌలభ్యం ప్రకారం నిర్ణయించబడుతుందని అనుకోవద్దని సూచించారు. అనంతరం పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకొని.. ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎంపికగా జరగదని హితవు పలికారు. ఇక చైనాని టార్గెట్ చేసుకొని.. కొన్ని దేశాలు ఎజెండాను రూపొందించి, నిబంధనలను నిర్వహించాలని అనుకుంటున్నాయని.. అయితే ఇది నిరవధికంగా కొనసాగదని అన్నారు. మనం అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నప్పుడు.. అది ఆత్మస్తుతి కోసం కాదని, మరింత బాధ్యతను స్వీకరించి ఇంకా సహకారం అందించాలని అన్నారు. ఎజెండాను నిర్దేశించుకోవడం, ఇతరులు తమ అభిప్రాయాలను అంగీకరించాలని ఆశలు పెట్టుకోవడం వంటి రోజులు పోయాయని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. అలీనోద్యమ కాలం నుంచి బయటపడి, ఇప్పుడు ‘విశ్వ మిత్ర’ అనే కాన్సెప్ట్‌ను భారత్ అభివృద్ధి చేసిందని అన్నారు. భాగస్వాములతో సహకారం ప్రోత్సాహించడానికి భారత్ ఎప్పుడూ ముందుంటుందని వెల్లడించారు. ఆఫ్రికన్ యూనియన్‌ను జి20లో చేర్చడం.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆధునీకరించడానికి కూడా స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే భారతదేశ విజన్.. కొన్ని దేశాల సంకుచిత ప్రయోజనాలపై కాకుండా అనేక దేశాల ప్రధాన ఆందోళనలపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ సమావేశాల్లో ఆయన మమిళా బిల్లుతో పాటు చంద్రయాన్-3 ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అలాగే.. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు ఫలితాలు అంతర్జాతీయ సమాజానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాయని చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-09-26T22:00:01+05:30 IST