Jairam Ramesh: మాస్టర్ ఆఫ్ డ్రామా.. ప్రధాని మోదీకి జైరాం రమేశ్ చురకలు
ABN, First Publish Date - 2023-11-21T18:35:13+05:30
భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయనను మాస్టర్ ఆఫ్ డ్రామా అంటూ అభివర్ణించారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యాక బాధలో ఉన్న ఆటగాళ్లను మోదీ...
భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయనను మాస్టర్ ఆఫ్ డ్రామా అంటూ అభివర్ణించారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యాక బాధలో ఉన్న ఆటగాళ్లను మోదీ ఓదార్చుతున్న వీడియోని బీజేపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన తర్వాత జైరాం రమేశ్ ఈ మేరకు ధ్వజమెత్తారు. ఇదంతా కటపనాటకమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత డబ్బా కొట్టుకోవడానికి స్వయంగా మోదీనే ఈ వీడియోని కొరియోగ్రాఫ్ చేసి విడుదల చేశారని విమర్శలు గుప్పించారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసిన తర్వాత భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగానికి లోనయ్యారు. చివరి నిమిషంలో వరల్డ్‌కప్ చేజారిపోయిందని ఆవేదనకు గురయ్యారు. దీంతో.. వారిలో ధైర్యం నింపేందుకు ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి వారిని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా విడుదల చేశారు. తొలుత షమీని హత్తుకొని మోదీ ఓదార్చే ఫోటో బయటకు వచ్చింది. ఆ మరుసటి రోజు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓదార్చే ఫోటోని విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా వారిని ఓదార్చే వీడియోని బీజేపీ ఎక్స్ వేదికగా విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ అనే తరహాలో.. బీజేపీ ఒక్కొక్కటిగా వీటిని విడుదల చేస్తూ వచ్చింది.
ఇలా విడతల వారీగా రోజుకొకటి విడుదల చేయడంపై.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రధానిని, బీజేపీని తూర్పారపట్టారు. ‘‘ఈ దేశంలో డ్రామాని పండించడంలో ప్రధాని మోదీని మించినవారు ఎవరూ లేరు. ఆయన మాస్టర్ ఆఫ్ డ్రామా. భారత ఆటగాళ్లను ఓదారుస్తున్న వీడియోని స్వయంగా మోదీనే కొరియోగ్రఫీ చేసి విడుదల చేశారు. అయితే ఈ ఫోటోలు, వీడియోలు.. వాటి వెనుక ఉన్న అసలు అబద్ధాన్ని పూర్తిగా బట్టబయలు చేశాయి. తన పరువు కాపాడుకోవడం మోదీ చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇటువంటి చర్యలతో ఇప్పుడు భారత యువత మోసపోరు’’ అని జైరాం రమేశ్ విరుచుకుపడ్డారు. ఈ నాటకం వెనుక ముఖ్య ఉద్దేశం.. సొంత ప్రచారమే అన్నట్టు ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సెమీ ఫైనల్ వరకూ ఒక్క ఓటమి కూడా చవిచూడకుండా టీమిండియా అఖండ విజయాలు సాధించడంతో, ఫైనల్ మ్యాచ్‌లోనూ దుమ్ముదులిపి వరల్డ్ కప్ గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా ఫలితాలు నమోదయ్యాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలం కావడంతో టీమిండియాకి ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకి ఆలౌట్ అవ్వగా.. 43 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేధించి, ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
Updated Date - 2023-11-21T18:35:14+05:30 IST