Karnataka: కర్ణాటక లేడీ ఆఫీసర్ల జగడంలో ప్రభుత్వం ట్విస్ట్..
ABN, First Publish Date - 2023-02-21T15:37:25+05:30
కర్ణాటక రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఐఏఎస్ రోహిణి సింధూరి, రాష్ట్ర చేతివృత్తుల కార్పొరేషన్ ఎండీ ఐపీఎస్ రూపా మౌద్గల్ పరస్పర ఆరోపణల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఐఏఎస్ రోహిణి సింధూరి, రాష్ట్ర చేతివృత్తుల కార్పొరేషన్ ఎండీ ఐపీఎస్ రూపా మౌద్గల్ పరస్పర ఆరోపణల వ్యవహారంలో (Karnataka women officer fight) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరికీ ఊహించని షాక్ ఇస్తూ.. పోస్టింగ్ ఇవ్వకుండానే తక్షణమే బదిలీ చేసింది. వివాదం చెలరేగిన మరుసటి రోజునే ఇద్దరినీ వారివారి శాఖల నుంచి గెంటేసినంత పనిచేసింది. ఇరువురూ కర్ణాటక చీఫ్ సెక్రటరీ వద్ద ఫిర్యాదు చేసిన మరుసటి రోజు మంగళవారం ఈ పరిణామం చోటుచేసుకుంది.
కాగా ఐఏఎస్ రోహిణి సింధూరి (IAS rohini sindhuri), ఐపీఎస్ రూపా మౌద్గల్ (rupa mudgal) తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (basavaraj bommai) మండిపడ్డారు. ఈ మేరకు ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేయాలని చీఫ్ సెక్రటరీని సోమవారం ఆదేశించారు. అందుకు అనుగుణంగానే సోమవారం మధ్యాహ్నం ఐఏఎస్ రోహిణి సింధూరి విధానసౌధలో చీఫ్ సెక్రటరీ వందితాశర్మను భేటీ అయ్యారు. నాలుగు పేజీలతో ఐపీఎస్ రూపా మౌద్గల్ ఆరోపణలకు వివరాలను అందించారు. తనపై సోషల్ మీడియాలో నిరాధార, అబద్ధాలు, వ్యక్తిగతమైన ఆరోపణలు చేశారని, సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించిన మేరకు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అనంతరం విధానసౌధలో రోహిణి సింధూరి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మీడియా ముందుకు రాకూడదనే నిబంధన ఉందన్నారు. కానీ వ్యక్తిగతంగా తనతోపాటు తన భర్తపైనా ఆరోపణలు చేశారన్నారు. చీఫ్ సెక్రటరీకి సమగ్రంగా వివరాలు అందించానని తెలిపారు. మండ్యలో సీఈఓగా శౌచాలయాలు రికార్డు స్థాయిలో నిర్మించినందుకు కేంద్రప్రభుత్వం గుర్తించిందని, ఇన్నేళ్ల తర్వాత ఆరోపణలు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ఫొటోలు పంపాననే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జాలహళ్లిలోని నివాసం తన భర్త తల్లికి చెందినదన్నారు.
సోమవారం చీఫ్ సెక్రటరీని కలసిన ఐపీఎస్ రూపా
ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన మేరకు విధానసౌధలో సీఎస్ వందితా శర్మను ఐపీఎస్ రూపా మౌద్గల్ భేటీ అయ్యారు. అనంతరం మీడియా ముందుకు రాకూడదని భావించానని అయితే తనపై రోహిణి సింధూరి ఆరోపణలు చేసిన మేరకు స్పందించాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికే సీఎ్‌సకు వివరాలు తెలిపానని, ఆమె ఫొటోలు వ్యక్తిగతం కాదని, ఎవరు రక్షిస్తున్నారో బయటకు రావాలన్నారు. రోహిణిపై లోకాయుక్తకు చేరిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. జాలహళ్లి నివాసానికి సంబంధించి ఆస్తి పత్రంలో నమోదు చేయలేదని, తనది కాదంటే లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. సీఎ్‌సను కలిసేందుకు ముందు మీడియాతో మాట్లాడుతూ గెట్ వెల్ సూన్ అంటూ పోస్ట్ చేశారని, డిలీట్ అయిన న్యూడ్ ఫొటోల గురించి మాట్లాడుతారా..? అంటూ రూపా ఆరోపించడం మరో సంచలనమైంది.
అసలు ఇద్దరి మధ్య వివాదం ఏంటంటే..
కర్ణాటకలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. పలు వివాదాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవదాయశాఖ కమిషనర్ రోహిణి సింధూరి(ఐఏఎస్)పై హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రూపాముద్గల్(ఐపీఎస్) ఆదివారం ట్విటర్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను కూడా అందులో పోస్ట్ చేశారు. ఐఏఎస్ రోహిణి, ఎమ్మెల్యే సారా మహేశ్‌తో రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రూప ప్రశ్నించారు. ‘చామరాజనగరలో కొవిడ్ వేళ ఆక్సిజన్ అందక పలువురు మరణించిన అంశంలోనూ సక్రమంగా వ్యవహరించారా? కొవిడ్‌తో దేశమంతటా జనం తల్లడిల్లుతుంటే మైసూరు కలెక్టరేట్‌లో విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్ నిర్మించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి’ అని విమర్శించారు. ఐపీఎస్ ఎన్.హరీశ్ మృతిపైనా అనుమానం వ్యక్తం చేశారు. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మించే విషయాన్నీ ప్రస్తావించారు. ఆమెకు ఎవరు మద్దతిస్తున్నారో? ఇటువంటి వారికి ఎందుకు శిక్షలు పడవో అర్థం కావడం లేదన్నారు.
న్యాయ పోరాటం చేస్తా: రోహిణి
తనపై ఆరోపణలు చేసిన రూపపై న్యాయ పోరాటం చేస్తానని రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ‘బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్నవారు సమాజానికి మంచి పనులు చేయాలిగానీ, వ్యక్తిగత విషయాలపై అబద్ధాలు పోస్టు చేయడం సరికాదు’ అన్నారు.
Updated Date - 2023-02-21T15:47:09+05:30 IST