Kerala High Court : శబరిమలలో భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు ప్రత్యేక విచారణ
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:56 AM
శబరిమలలో రద్దీ అనూహ్యంగా పెరిగి భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ వచ్చిన వార్తలపై కేరళ హైకోర్టు స్పందించింది. సోమవారం స్పెషల్ సిట్టింగ్
కోచి, డిసెంబరు 25: శబరిమలలో రద్దీ అనూహ్యంగా పెరిగి భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ వచ్చిన వార్తలపై కేరళ హైకోర్టు స్పందించింది. సోమవారం స్పెషల్ సిట్టింగ్ నిర్వహించి ట్రావంకోర్ దేవస్వంబోర్డు(టీడీబీ)కు, ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. భక్తుల కోసం మార్గమధ్యలో ఏర్పాటు చేసిన ‘ఎడతవలం’ (తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు)ల వద్ద మంచినీరు, అల్పాహారం అందజేయాలని ఆదేశించింది. భక్తులు, పిల్లలు ఎలాంటి ఆహారం, నీరు లేకుండా దాదాపు 12 గంటల పాటు వాహనాల్లో రోడ్లపైనే ఉండిపోవాల్సి వస్తోందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొంది. సన్నిధానం వద్ద కూడా గంటల కొద్దీ భక్తులు క్యూ లైన్లలో నిల్చోని ఉండాల్సి వస్తుండడాన్నీ గమనించింది. అదనపు పోలీసు బలగాలను పంపించి రద్దీని నియంత్రించాలని డీజీపీని ఆదేశించింది. ఆదివారం ఒక్క రోజే 1.2 లక్షల మంది భక్తులు వచ్చినట్టు టీడీబీ వర్గాలు తెలిపాయి. సోమవారం వారి సంఖ్య మరింతగా పెరిగిందని పేర్కొన్నాయి. సోమవారం 88వేల మంది వర్చువల్ క్యూ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని, పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు కూడా వచ్చారని అధికారులు చెప్పారు.
Updated Date - Dec 26 , 2023 | 12:56 AM