Allahabad High Court : కృష్ణ జన్మభూమిపై శాస్త్రీయ సర్వే
ABN, Publish Date - Dec 15 , 2023 | 05:15 AM
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీకృష్ణ జన్మభూమి మందిరానికి సమీపంలో ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు గురువారం అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయస్థానం
ముగ్గురు అడ్వకేట్ కమిషనర్ల సమక్షంలో నిర్వహణ
అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 14: మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీకృష్ణ జన్మభూమి మందిరానికి సమీపంలో ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు గురువారం అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయస్థానం పర్యవేక్షణలో ఈ సర్వే జరగనుంది. ఇందుకు ముగ్గురు న్యాయవాదులను అడ్వకేట్ కమిషనర్లుగా నియమించనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 18వ తేదీన ప్రకటించనుంది. ఇటీవల వారాణసిలోని జ్ఞాన్‌వాపీ మసీదు ప్రాంగణంలో జరిపిన శాస్త్రీయ సర్వే మాదిరిగానే ఈ సర్వే కూడా ఉండనుంది. ఈ అంశంపై నవంబరు 16న వాదనలు పూర్తి కాగా న్యాయమూర్తి జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెలువరించారు. మథురలోని కట్రా కేశవ్‌దేవ్ మందిరం మూల మూర్తి అయిన భగవాన్ శ్రీకృష్ణ విరాజమాన్ పేరుతో హైకోర్టులో ఈ వాజ్యం దాఖలయింది. శ్రీకృష్ణుని మిత్రులమని పేర్కొంటూ ఏడుగురు వ్యక్తులు.. ముగ్గురు న్యాయవాదులైన విష్ణు శంకర్ జైన్, ప్రభాస్ పాండే, దేవకీ నందన్‌లు ద్వారా ఈ దావా వేశారు. మందిరాన్ని పడగొట్టి మసీదును నిర్మించారని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని పిటిషనర్లు తమ వ్యాజ్యంలో తెలిపారు. పద్మం ఆకారంలోని స్తంభం, శేషనాగు, ఇతర విగ్రహాలు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని గుర్తించేందుకు నిర్ణీత వ్యవధిలో శాస్త్రీయ సర్వే జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ముస్లింల గౌరవాన్ని హరించడమే లక్ష్యం: ఒవైసీ
అలహాబాద్ హైకోర్టు నిర్ణయంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ముస్లింల గౌరవాన్ని హరించడమే ఒక వర్గం లక్ష్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సమస్యపై గతంలోనే రాజీ కుదిరినా, ప్రార్థనా స్థలాల చట్టం ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
Updated Date - Dec 15 , 2023 | 05:15 AM