26/11 Mumbai attacks : పాక్ జైలులో లష్కరే తొయిబా ఉగ్రవాది మృతి
ABN, First Publish Date - 2023-05-30T13:55:51+05:30
ముంబై దాడులకు ఉగ్రవాదులను ప్రేరేపించిన లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ సలామ్ భుట్టావి పాకిస్థాన్‌లోని ఓ జైలులో గుండెపోటుతో మరణించాడు
న్యూఢిల్లీ : ముంబై దాడులకు ఉగ్రవాదులను ప్రేరేపించిన లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ సలామ్ భుట్టావి పాకిస్థాన్‌లోని ఓ జైలులో గుండెపోటుతో మరణించాడు. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆయనను 2012లో ఉగ్రవాదిగా ప్రకటించింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఆయన దోషి అని 2020లో తీర్పు వచ్చింది.
భుట్టావి టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో దోషి అని నిర్థరణ కావడంతో ఆయనకు కోర్టు పదహారున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సమీప బంధువు అబ్దుల్ రహమాన్ మక్కి కూడా దోషి అని కోర్టు తీర్పు చెప్పింది.
హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం 2002, 2008 సంవత్సరాల్లో అరెస్టు చేసినపుడు లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు తాత్కాలిక చీఫ్‌గా భుట్టావీ వ్యవహరించాడు. భుట్టావీ పాకిస్థానీ జైలులో మరణించినట్లు ఈ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేస్తున్న సంస్థలు సోమవారం రాత్రి వెల్లడించాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని షేకుపురలో ఉన్న జైలులో సోమవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో భుట్టావీ మరణించాడని తెలిపాయి. లాహోర్ సమీపంలో ఆయన అంత్యక్రియలు జరిగినట్లు తెలిపాయి.
నిజమేనంటున్న భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు
భుట్టావీ మరణించినట్లు భారతీయ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ధ్రువీకరించారు. అయితే పూర్తి వివరాలు తెలియవలసి ఉందని చెప్పారు. 2008 నవంబరులో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులను ప్రేరేపించి, శిక్షణ ఇచ్చినవాడు భుట్టావీయేనని అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రాణ త్యాగం వల్ల జరిగే ప్రయోజనాల గురించి ఉపన్యాసాలు ఇచ్చి, ఆ ఉగ్రవాదులను ప్రేరేపించినట్లు తెలిపింది. లష్కరే తొయిబా, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థల మదరసా నెట్‌వర్క్‌ల నిర్వహణలో ఇతని ప్రమేయం ఉన్నట్లు తెలిపింది. ఈ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు అనుమతిస్తూ ఫత్వాలు జారీ చేశాడని తెలిపింది.
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగియున్నందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఫైనాన్సింగ్, ప్లానింగ్ చేస్తున్నందుకు, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నందుకు అతనిని ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2012లో ప్రకటించింది.
భీకర ఉగ్రవాద దాడులు
2008 నవంబరు 26 నుంచి 29 వరకు మూడు రోజులపాటు ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. వీరిలో అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందినవారు కూడా ఉన్నారు. ఈ కేసులో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్ కమాండర్ జకీయుర్ రహమాన్ లఖ్వీతోపాటు మరికొందరిని పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. అయితే విచారణలో పురోగతి లేదు.
ఇవి కూడా చదవండి :
Moscow : రష్యా రాజధానిపై డ్రోన్ల దాడి
Delhi excise policy scam : మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
Updated Date - 2023-05-30T13:55:51+05:30 IST