Farooq Abdullah: రాముడు హిందువులకే కాదు, ప్రపంచానికే దేవుడు: ఫరూక్ అబ్దుల్లా
ABN, Publish Date - Dec 30 , 2023 | 03:41 PM
అయోధ్యలో రామలయం నిర్మాణానికి కృషి చేసిన ప్రజలందరికి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అభినందనలు తెలిపారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాముడు హిందువులకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచలోని ప్రతి ఒక్కరికి చెందిన వాడని అన్నారు.
పూంచ్: అయోధ్యలో రామలయం (Ayodhya Ram Temple) నిర్మాణానికి కృషి చేసిన ప్రజలందరికి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) అభినందనలు తెలిపారు. ఇండియాలో సౌభ్రాతృత్వం తగ్గిందని, దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాముడు హిందువులకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచలోని ప్రతి ఒక్కరికి చెందిన వాడని అన్నారు. ఈ విషయం యావద్దేశానికి తాను చెప్పదలచుకున్నానని అన్నారు. ప్రపంచంలోని ప్రజలందరికీ రాముడు దేవుడని, ఆ విషయం పుస్తకాల్లో కూడా రాసుందని చెప్పారు.
సౌభ్రాతృత్వం, ప్రేమ, ఐక్యత, పరస్పర సహకారం వంటివి రాముడు మానవాళికి ఇచ్చిన సందేశమని అన్నారు. మతం, జాతి బేధం లేకుండా బడుగువర్గాల అభ్యు్న్నతికి పాటుపడాలని రాముడు చెబుతుండేవారని, రామాలయం ప్రారంభోత్సవ తరుణంలో దేశంలో క్షీణిస్తున్న సౌభ్రాతృత్వ భావనలను తిరిగి పునరుద్ధరించాలని ప్రజలందరికీ తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. 2024 జనవరి 22 అయోధ్యలోని భవ్య రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు 4,000 మంది సాధువులు, వివిధ రంగాల ప్రముఖులు, దేశవ్యాప్తంగా వేలాది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Updated Date - Dec 31 , 2023 | 07:51 AM