మహోగ్ర గంగ.. శాంతించని యమున
ABN, First Publish Date - 2023-07-18T04:30:44+05:30
గంగానది మహోగ్ర రూపంతో దేవభూమి ఉత్తరాఖండ్ గజగజ వణికిపోతోంది. గంగ, దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో.. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. చాలా చోట్ల
డెహ్రాదూన్/న్యూఢిల్లీ, జూలై 17: గంగానది మహోగ్ర రూపంతో దేవభూమి ఉత్తరాఖండ్ గజగజ వణికిపోతోంది. గంగ, దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో.. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. చాలా చోట్ల రహదారులు, వంతెనలు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఢిల్లీలో యమున ఉధృతి తగ్గలేదు. ఈశాన్య రాష్ట్రం అసోంలోనూ 10 జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు తోడు.. గంగానది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. దేవప్రయాగ వద్ద గంగానది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. హరిద్వార్‌లో హెచ్చరిక స్థాయి అయిన 293 మీటర్లను దాటి గంగానది ప్రవహిస్తోంది. దాంతో అధికారులు పరీవాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. హరిద్వార్, రూర్కీ, ఖాన్‌పూర్, భగవాన్‌పూర్, లష్కర్ తహసీల్స్ పరిధిలోని 71 గ్రామాల్లో వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. 3,756 కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అటు ఢిల్లీలో యమునా నది ఇంకా శాంతించలేదు. సోమవారం ఉదయం మరోమారు నీటిమట్టం 205.58 మీటర్లను దాటింది. ఎగువ నుంచి వరద పెరగడంతో నీటిమట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎర్రకోట, రాజ్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో వరద నీరు ఇంకా నిలిచే ఉంది.
Updated Date - 2023-07-18T04:30:44+05:30 IST